Last Updated:
జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టును ప్రకటించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వగా, స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను సెలెక్టర్లు తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు సిద్ధమైంది. ఆతిథ్య జింబాబ్వేతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ పోరు జూలై 23 గురువారం రోజున ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత జట్టును శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నారు. టీ20 కెప్టెన్‌గా తొలి విజయం కోసం శ్రేయస్ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జట్టులో పలు సంచలనాత్మక మార్పులు చేశారు. ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్, నెంబర్ టు బ్యాటర్ అభిషేక్ శర్మ, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ జట్టులో స్థానం నిలబెట్టుకున్నారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో పోలిస్తే బౌలింగ్ విభాగంలో కొత్త ముఖాలకు అవకాశమిచ్చిన సెలెక్టర్లు, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సేవలను కోల్పోయారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026 సంవత్సరంలో విదేశీ గడ్డపై భారత జట్టుకు ఇది మూడో టీ20 సిరీస్ కావడం విశేషం.
అభిమానుల ఆగ్రహం జింబాబ్వే సిరీస్ ఎంపికలో పలువురు సీనియర్ ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్‌తో టీ20లు ఆడిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాంసన్‌తో పాటు పేసర్లు అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలను పక్కనబెట్టారు. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ఈసారి చోటు దక్కలేదు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో గాయపడిన వరుణ్ చక్రవర్తి సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
రింకూ రీఎంట్రీ ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన ఈ అలీగఢ్ బ్యాటర్ పునరాగమనం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. వేగవంతమైన బౌలర్ మయాంక్ యాదవ్ ఎట్టకేలకు గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ ఫాస్ట్ బౌలర్లు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే తొలిసారి టీ20 జట్టు పిలుపు అందుకున్నారు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు జట్టులో చోటు లభించింది.
గత ఇంగ్లాండ్ సిరీస్ నుంచి శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ తమ స్థానాలను కాపాడుకున్నారు.
జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














