తిరుమలలో మరోసారి భద్రతపై ప్రశ్నలు.. పెద్ది పోస్టర్‌తో నడక మార్గంలో మహిళ.. వీడియో వైరల్..! Tirumala Security Lapse. | | ACTPnews

News18


Last Updated:

తిరుమల నడక మార్గంలో ఓ మహిళ పెద్ది సినిమా పోస్టర్‌తో కనిపించడంపై భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News18
News18

తిరుమలలో భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు తలెత్తే ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న ఓ మహిళ చేతిలో పెద్ది సినిమా పోస్టర్ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతుండటంతో భక్తులు, నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో రాజకీయ, వాణిజ్య, సినిమా ప్రచారాలకు అనుమతి లేదనే నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో, పోస్టర్‌తో మహిళ నడక మార్గంలో ప్రయాణించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తి వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ పలు నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, సినిమాలు లేదా ఇతర వాణిజ్య ప్రచారాలకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు, ప్రచార సామగ్రిని అనుమతించరాదనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పెద్ద పరిమాణంలో సినిమా పోస్టర్‌తో మహిళ నడక మార్గంలో కనిపించడం భద్రతా సిబ్బంది తనిఖీలపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుండగా, పవిత్ర క్షేత్రంలో నిబంధనలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి ఇటీవల జరిగిన మరో వివాదం కూడా కారణమైంది. గత వారం ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం నుంచి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతున్న వేళ, అధికారిక అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయ మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించాడనే ఆరోపణలు కలకలం రేపాయి. మహాద్వారం వద్ద ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలించి మాత్రమే అనుమతించాల్సిన విజిలెన్స్ విధానం ఈ ఘటనలో సక్రమంగా అమలుకాలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.

వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో తిరుమలలో భద్రతా వ్యవస్థపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పవిత్రతకు ప్రతీకగా భావించే తిరుమలలో నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని, తనిఖీలను మరింత పటిష్ఠం చేయాలని భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports