Last Updated:
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న ఆయన డిమాండ్‌పై కేంద్రం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని, వెంటనే నిరాహార దీక్ష విరమించాలని నడ్డా విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను అధికారులు తొలుత సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మెదాంత ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జేపీ నడ్డా.. వాంగ్‌చుక్ వెంటనే తన నిరాహార దీక్షను విరమించి, యువతను సరైన మార్గంలో నడిపించాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే, వాంగ్‌చుక్ రాసిన బహిరంగ లేఖపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, లేఖకు బదులిచ్చిన తర్వాత తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని నడ్డా వివరించారు.
#WATCH | Delhi: Union Health Minister JP Nadda says, “If I talk about the paper leak in the Service Selection Board examination in Jammu and Kashmir where the government is of Congress and NC of National Conference. Similarly, in Himachal Pradesh, the paper leak happened in… pic.twitter.com/XHN0NNFykI
— ANI (@ANI) July 22, 2026
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులు, యువతపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని స్పష్టమైన హామీ ఇస్తేనే నిరాహార దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ కేంద్రానికి తేల్చిచెప్పారు. ఈ మేరకు మంత్రులకు రాసిన లేఖలో ఆయన తన డిమాండ్లను స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయబద్ధమైన విద్యావ్యవస్థ కోసం గొంతెత్తిన విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
నీట్ లీకేజీల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరిగేలా చూస్తామని వాంగ్చుక్కు నడ్డా, జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన రావడం కాస్త ఊరటనిచ్చే అంశం.
ప్రభుత్వం చాలా డిమాండ్లకు అంగీకరించినా, విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన, శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని లిఖితపూర్వక హామీ ఇచ్చే విషయంలోనే ఇంకా పీటముడి వీడలేదని వాంగ్‌చుక్ వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న ఏ ఒక్క యువకుడిపైనా కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం కచ్చితమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేస్తే వాంగ్‌చుక్ దీక్ష ముగిసే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














