Hyderabad: ఇల్లు కట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు.. బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి ఆ పని.. పోలీసుల ఎంట్రీతో ఎండ్ కార్డ్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: ఆశకు హద్దులు, పేరాశకు అంతు ఉండవంటారు. స్థాయికి మించి ఆర్భాటాలకు పోయి, విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కితే చివరికి మిగిలేది కటకటాల వెనుకేనని నిరూపించింది ఈ ఘటన.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కోట్ల వ్యాపారం జరిగే సంస్థలో నమ్మకమైన ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్న ఒక యువకుడు.. తన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చుకోవడానికి ఏకంగా పనిచేస్తున్న చోటే భారీ చోరీకి పాల్పడ్డాడు. తమ్ముడి సహాయంతో ఏకంగా రూ.1.60 కోట్ల విలువైన బంగారాన్ని కాజేసి చివరికి పోలీసుల చేతికి చిక్కిన ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ ప్రాంతం కల్మట కాలనీకి చెందిన ఎం.హరీశ్‌ (29), ఎస్.ఆకాశ్ (25) అనే అన్నదమ్ములు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి మంగళ్‌హాట్‌లో స్థిరపడ్డారు. తమ్ముడు ఆకాశ్ హైటెక్‌సిటీలోని ఒక ఐటీ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తుండగా, అన్న హరీశ్ 2021 నుంచి ‘గుడువుష ఎక్స్‌పోర్ట్’ అనే ప్రముఖ ఆభరణాల సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. ఈ సంస్థ తయారుచేసిన బంగారు, వజ్రాభరణాల డిజైన్లను నగరంలోని ప్రముఖ జ్యువెలరీ షాపులకు తీసుకెళ్లడం, వారి నుంచి ఆర్డర్లు తీసుకుని విలువైన ఆభరణాలను చేరవేయడం హరీశ్ పని. నాలుగేళ్లుగా అత్యంత నమ్మకంగా పనిచేస్తూ యజమానులు, మేనేజ్‌మెంట్ ప్రశంసలు అందుకున్నాడు.

విలాసాల మోజు.. అప్పుల ఊబి

నమ్మకంగా పనిచేస్తున్న క్రమంలోనే హరీశ్ సొంత ఇంటి నిర్మాణం చేపట్టి, ఆ తర్వాత వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇల్లు కట్టడానికి, పెళ్లికి అయిన ఖర్చుల వల్ల అతను భారీగా అప్పులపాలయ్యాడు. ప్రతి నెలా వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోకపోవడం, ఒకవైపు అప్పుల ఒత్తిడి పెరిగిపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నేరబాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. తాను పనిచేస్తున్న సంస్థలోనే కోట్ల విలువైన బంగారం ఉంటుందని తెలిసిన అతను.. దాన్ని దొంగిలించడమే సరియైన మార్గమని భావించాడు. ఈ ప్లాన్‌కు తన తమ్ముడు ఆకాశ్‌ను కూడా ఒప్పించాడు.

బాత్‌రూమ్ గ్రిల్స్ తొలగించి స్కెచ్

ఈ క్రమంలో సంస్థ మేనేజర్ పనిమీద ముంబై వెళ్లడాన్ని హరీశ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పక్కా పథకం ప్రకారం.. దుకాణం వెనుక వైపు ఉన్న బాత్‌రూమ్ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌లో ఉన్న దాదాపు 1.029 కిలోల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను (విలువ రూ. 1.60 కోట్లు) చోరీ చేశాడు. ఆ నగలను ఎవరికీ అనుమానం రాకుండా తన తమ్ముడు ఆకాశ్‌కు అప్పగించి ఏమీ తెలియనట్లు నటించాడు.

సీసీటీవీల ఆధారంగా పట్టుకున్న పోలీసులు

సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ మరియు జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్లు సీహెచ్.యాదేందర్, కవియుద్దీన్, ఎస్సై మహ్మద్ జాహెద్‌లతో కూడిన బృందం సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటన జరిగిన తీరును బట్టి తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానించిన పోలీసులు, హరీశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.

నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన రూ.1.60 కోట్ల విలువైన 1.029 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అన్నదమ్ములిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ గ్రేడ్ వైభవ్ రఘునాథ్ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed