Last Updated:
మే నెల ప్రారంభమైన మొదటి 20 రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల ట్యాంకర్లను జలమండలి సరఫరా చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Hyderabad: మహా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు (Groundwater Levels) పాతాళానికి పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నీటి కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో తాగునీటి అవసరాల కోసం జలమండలి (HMWSSB) వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే వారి సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయింది. మే నెల ప్రారంభమైన మొదటి 20 రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల ట్యాంకర్లను జలమండలి సరఫరా చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా రోజుకు సగటున 12 వేలకు పైగా ట్యాంకర్లు నగర వీధుల్లో పరుగులు తీస్తున్నాయి.
సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వాటర్ ట్యాంకర్లకు గరిష్ఠంగా డిమాండ్ ఉంటుంది. మే నెల వచ్చేసరికి రోహిణీ కార్తె ప్రవేశించినప్పటికీ, అక్కడక్కడా పడే ముందస్తు వర్షాల వల్ల డిమాండ్ కొంత తగ్గుముఖం పట్టడం గత రెండేళ్లుగా చూస్తున్నాం. కానీ, ఈ ఏడాది (2026) మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఏప్రిల్ నెల కంటే మే నెలలోనే డిమాండ్ ఊహించని రీతిలో భారీగా పెరిగింది.
గతేడాది (2025) మే నెల మొత్తం మీద జలమండలి ద్వారా కేవలం 1.69 లక్షల ట్యాంకర్ల సరఫరా మాత్రమే జరిగింది. కానీ ఈ ఏడాది మే 20వ తేదీ నాటికే ఆ సంఖ్యను దాటేసి, ఏకంగా 2.60 లక్షల మార్కుకు చేరుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో వర్షాలు పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఏటా నీటి వినియోగం మరియు డిమాండ్ ఏ విధంగా పెరుగుతోందో చెప్పడానికి జలమండలి విడుదల చేసిన ఈ గణాంకాలే నిదర్శనం:
2024 మే నెలలో: 1,18,191 ట్యాంకర్లు
2025 మే నెలలో: 1,69,347 ట్యాంకర్లు
2026 మే నెలలో: 2,59,809 ట్యాంకర్లు
నగరంలో నీటి ఎద్దడిపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో జలమండలి అధికారులకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. రాబోయే రోజుల్లో నీటి సరఫరా మరింత తగ్గిపోతుందేమోనన్న భయంతో నగరవాసులు ‘ముందస్తు బుకింగ్‌ల’ (Advance Bookings) కు తెరలేపారు. పెట్రోల్ కొరత వస్తుందనే ప్రచారం జరగగానే బంకుల వద్ద క్యూ కట్టి ట్యాంకులు ఫుల్ చేసుకునే తరహాలోనే.. ఐటీ కారిడార్ (Madhapur, Gachibowli) తో పాటు కొన్ని నివాస ప్రాంతాల్లో నీటి అవసరం లేకపోయినా ముందు జాగ్రత్తగా ట్యాంకర్లను బుక్ చేసి నిల్వ చేసుకుంటున్నారు.
దీనివల్ల ట్యాంకర్ల వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా, ప్రస్తుతం బోర్లలో చుక్క నీరు లేక, నిజంగా అర్జెంటుగా నీటి అవసరం ఉన్న నిరుపేదలు, సాధారణ కాలనీల వాసులకు సకాలంలో ట్యాంకర్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జలమండలి ట్యాంకర్ల సరఫరాను మరింత వేగవంతం చేస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లోనే ఆయా నివాసాలకు నీరు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్రిప్పుల సంఖ్యను పెంచడంతో పాటు రాత్రి సమయాల్లోనూ సరఫరాను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, అత్యవసరమైతే తప్ప ముందస్తు బుకింగ్‌లు చేసుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hyderabad,Telangana













