Last Updated:
Iran vs USA: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అత్యంత భారీ స్థాయిలో భీకర దాడి చేసేందుకు తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నామని ఆయన ప్రకటన చేశారు.
ఈ ప్రతిపాదిత దాడి మునుపెన్నడూ లేని రీతిలో భారీగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ‘ఆక్సియోస్’ (Axios) ప్రతికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేం ఇరాన్‌పై భారీ దాడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటివరకు చూడనంత తీవ్ర స్థాయిలో ఈ దాడి ఉంటుంది. తుది నిర్ణయానికి చాలా చేరువలో ఉన్నాం. మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు “ఇంకా తగినంత తీవ్రమైన నొప్పి తెలియలేదు” అని ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతానికి కొత్తగా సైనిక ఆదేశాలేవీ జారీ చేయలేదని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ సైనిక చర్యలో ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై స్పందిస్తూ.. తాము ఒక్క పిలుపు ఇస్తే రెండు నిమిషాల్లో ఇజ్రాయెల్ తమతో చేరుతుందని, కానీ తమకు ఎవరి సహాయం అవసరం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ఒంటరిగానే దాడి చేయగలదని పేర్కొన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా పాల్గొంటే ఇరాన్ నుంచి ఎదురయ్యే తిరుగుబాటు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
గత 12 రోజులుగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా తన వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పశ్చిమాసియా వ్యాప్తంగా తన దాడులను కొనసాగిస్తోంది.
ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $100 మార్కును దాటేసాయి.
ఈ పోరు ఇప్పుడు కేవలం యూఎస్-ఇరాన్ మధ్య కాకుండా పశ్చిమాసియాలోని ఇరాన్ మద్దతుగల ప్రతినిధి (Proxy) బృందాలకు పాకింది. యెమెన్‌లోని హూతీ రెబెల్స్ ఎర్రసముద్రంలో సౌదీ ఓడలపై దాడులను పెంచారు.
దీనిపై హెచ్చరించిన ట్రంప్.. హూతీలు చేసే దాడులను నేరుగా ఇరాన్ చేసిన దాడులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ హూతీలు నౌకలను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్‌పై భారీ సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ తమతో చర్చలకు రావాలని భావిస్తున్నప్పటికీ, అందుకు సరైన వాతావరణం ఇంకా ఏర్పడలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మల్టీ-ఫ్రంట్లలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఆందోళన నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














