Last Updated:
భారత హాకీ జట్ల జెర్సీ రంగును బ్లూ నుంచి కాషాయ రంగుకు (ఆరెంజ్) మార్చడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని హాకీ ఇండియా స్పష్టం చేసింది.
వచ్చే నెలలో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ (FIH) హాకీ వరల్డ్ కప్ 2026 కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జాతీయ జట్ల జెర్సీ రంగును అనూహ్యంగా మార్చేసింది. దశాబ్దాలుగా భారత జట్టుకు ఐడెంటిటీగా ఉన్న సంప్రదాయ బ్లూ జెర్సీ స్థానంలో కొత్తగా కాషాయం (ఆరెంజ్) రంగు కిట్‌ను పరిచయం చేసింది. ఈ నిర్ణయంపై భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెర్సీ రంగు మార్చడం వెనుక ఉన్న లాజిక్ ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ రంగు మార్పుపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై స్పందించిన హాకీ ఇండియా సీనియర్ అధికారి ఒకరు.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కొట్టిపారేశారు. జాతీయ జెండాలో కాషాయం ఒక భాగమని, మార్పును ఎప్పుడూ స్వాగతించాలని ఆయన సూచించారు.
సంప్రదాయ బ్లూ జెర్సీని మార్చడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల విజిబిలిటీ అని ఆ అధికారి వివరించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా బ్లూ టర్ఫ్ (మైదానం) పైనే జరుగుతున్నాయి. మైదానం రంగు, జెర్సీ రంగు ఒకేలా ఉండటం వల్ల ఆటగాళ్లను గుర్తించడం వీక్షకులకు కష్టంగా మారుతోంది. ఆరెంజ్ రంగు వల్ల కాంట్రాస్ట్ పెరిగి, టర్ఫ్‌పై ఆటగాళ్లు స్పష్టంగా కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు.

కొత్త కిట్‌ను ఆవిష్కరిస్తూ హాకీ ఇండియా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. జెర్సీలోని ప్రతి కుట్టు ఒక కథను చెబుతుందని, ప్రతి రంగు దేశ గర్వాన్ని చాటుతుందని పేర్కొంది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయాలకు ప్రతీక అని వెల్లడించింది. ఉదయిస్తున్న సూర్యుడి స్ఫూర్తితో రూపొందించిన ఈ డిజైన్ సరికొత్త ఆరంభానికి సంకేతమని వివరించింది. ఇందులో తెలుపు రంగు ప్రత్యామ్నాయ జెర్సీలు కూడా ఉంటాయి.
Presenting the new India jersey! 🇮🇳
Every stitch tells a story. Every pattern, every colour carries India’s pride.Our teams are ready to once again do the country proud at the FIH Hockey World Cup Belgium & Netherlands 2026.
🎥: Select 2 (SD+HD)+ Khel & JioHotstar
🗓️: August… pic.twitter.com/8GvwbByapq— Hockey India (@TheHockeyIndia) July 27, 2026
జెర్సీ మార్పు నిర్ణయం తనకు ఎంతో ఇబ్బందికరంగా అనిపించిందని వీరేన్ రస్కిన్హా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు వారసత్వం, గుర్తింపు ఎప్పుడూ ‘బ్లూ’ రంగుతోనే ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నో ఏళ్ల పాటు గర్వంగా బ్లూ జెర్సీ ధరించానని, అభిమానులు కూడా మన జట్టును ఆ రంగులోనే చూడాలని కోరుకుంటారని అభిప్రాయపడ్డారు. తన వాదన కేవలం జాతీయ జట్టు గుర్తింపు, వారసత్వం గురించేనని రస్కిన్హా స్పష్టం చేశారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














