PM Modi: ప్రధాని మోదీ మార్ఫింగ్ వీడియోల కలకలం.. హైదరాబాద్‌లో మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు | | ACTPnews

News18


Last Updated:

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

News18
News18

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు ఆయా ఖాతాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్.వి సుభాష్ తెలిపారు.

నీట్ పేపర్ లీక్ ఆందోళనల సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ తప్పుదోవ పట్టించే కంటెంట్ ఎక్కువగా సర్క్యులేట్ అయినట్లు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ఉన్న ఈ పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు ఉద్దేశపూర్వకంగా మార్ఫింగ్ వీడియోలు సృష్టిస్తున్నారని.. ఈ సందర్బంగా ఆయన ఘాటుగా స్పందించారు.

ఎన్.వి సుభాష్ ఏమన్నారంటే..

ఈ అంశంపై సుభాష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించిన మాట వాస్తవమేనని.. అయితే అదే సమయంలో ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలు, నైతికత దృష్ట్యా ప్రభుత్వం కొన్ని సహేతుకమైన ఆంక్షలు విధించే హక్కు ఉందని ఆయన గుర్తుచేశారు. విమర్శలను, రాజకీయ వ్యతిరేకతను తాము కచ్చితంగా స్వాగతిస్తామని ఆయన చెప్పారు. కానీ విమర్శ వేరు.. రాజకీయాల ముసుగులో ఇలాంటి అసభ్యకరమైన దాడులకు పాల్పడటం వేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలకు చోటు ఉందే తప్ప, ఇలాంటి ‘డిజిటల్ లించింగ్’ (ఆన్‌లైన్ దాడులు) చేయడానికి కాదన్నారు. దేశ యువత మనసుల్లో విద్వేషాలు నింపేందుకు సోషల్ మీడియా వేదికగా మారకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మెటా సంస్థకు స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన మెటా (META) సంస్థకు కూడా ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్లాట్‌ఫామ్‌పై మెటా సంస్థకు హక్కు ఉండొచ్చు కానీ, భారతదేశ ప్రజాస్వామ్య విలువలపై కాదని చురకలు అంటించారు. భారత చట్టాలకు ఏ బహుళజాతి కంపెనీ కూడా అతీతం కాదని తేల్చిచెప్పారు. అభ్యంతరకరమైన కంటెంట్ గురించి పదేపదే ఫిర్యాదు చేస్తున్నా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే.. చట్టపరంగా ఆయా సంస్థలు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

విపక్ష నేతలపై ప్రశ్నల వర్షం

తమ ఫిర్యాదు కేవలం విమర్శలను అణచివేసేందుకు కాదని, విమర్శలకు అసభ్యకరమైన దాడులకు మధ్య ఉన్న గీతను గుర్తుచేయడానికే అని సుభాష్ తెలిపారు. ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటున్న వారు.. గతంలో ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి విపక్ష నేతలను విమర్శించిన సామాన్యులను జైలుకు పంపినప్పుడు ఎందుకు నోరుమెదపలేదని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు. వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏవీ కూడా చట్టానికి అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ వేదికగా ఒకరి వ్యక్తిత్వాన్ని హరించే ఇలాంటి దాడులను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎప్పటికీ సహించదని సుభాష్ తేల్చిచెప్పారు.

కఠిన చట్టాల కింద కేసులు

ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్లు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66-సీ (గుర్తింపు దొంగతనం), సెక్షన్ 67 (అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించడం) కింద కేసులు బుక్ చేశారు. వీటితో పాటుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) లోని సెక్షన్ 353(2), 336(4) కింద కూడా అభియోగాలు నమోదు చేశారు.

మెటా సంస్థకు నోటీసులు

కేసు నమోదు చేసిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు మెటా సంస్థకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుదారులు రిపోర్ట్ చేసిన అభ్యంతరకరమైన లింక్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ తప్పుడు వీడియోలను పోస్ట్ చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరారు. ఆయా సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్న ఆకతాయిలను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports