Donald Trump: భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్.. ఉద్యోగం చేయాలంటే ఇన్ని లక్షలు కట్టాల్సిందే! | | ACTPnews

News18


Last Updated:

అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఓపీటీ (OPT) ద్వారా పనిచేసే వారిపై ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించాలని యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.

News18
News18

అమెరికాలో ఉన్నత విద్య చదివి, అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు, ఇతర విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పిడుగు లాంటి వార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ – OPT) కింద అక్కడే ఉండి ఉద్యోగం చేసే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, ఈ ఓపీటీ విధానంలో భారీ మార్పులు తీసుకురావాలని, విదేశీ విద్యార్థుల నుంచి ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ. 90 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం, విదేశీయుల రాకను నియంత్రించడమే లక్ష్యంగా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, అత్యధికంగా నష్టపోయేది భారతీయ విద్యార్థులే. ఇప్పటికే అప్పులు చేసి, ఎన్నో ఆశలతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వేలాది మంది భారతీయ యువత భవిష్యత్తు ఈ నిర్ణయంతో ప్రశ్నార్థకంగా మారనుంది. అమెరికా కల ఇక సామాన్యులకు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

అమెరికన్ ఫస్ట్ విధానంలో భాగమే

డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ‘అమెరికన్ ఫస్ట్’ హామీని అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోని స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలంటే విదేశీయుల వలసలను భారీగా తగ్గించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్-1బీ (H-1B) వీసాలతో పాటు ఓపీటీ ప్రోగ్రామ్‌పై కూడా తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. లక్ష డాలర్ల ఫీజు విధిస్తే చాలామంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగ ప్రయత్నాలు విరమించుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఓపీటీ అంటే ఏమిటి?

అమెరికాలో గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు తమ సంబంధిత రంగంలో ఆచరణాత్మక అనుభవం పొందేందుకు ఓపీటీ అవకాశం కల్పిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) కోర్సులు చదివిన వారు గరిష్టంగా మూడేళ్ల పాటు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఇతర కోర్సులు చదివిన వారికి ఏడాది పాటు ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత వారు హెచ్-1బీ వీసాకు మారాల్సి ఉంటుంది. అమెరికా కంపెనీలకు కూడా నైపుణ్యం ఉన్న యువత ఈ ఓపీటీ ద్వారానే అందుబాటులోకి వస్తున్నారు.

భారతీయులపై తీవ్ర ప్రభావం

ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికం. లక్షల రూపాయలు అప్పులు చేసి చదువు కోసం వెళ్లిన వీరంతా, ఓపీటీ ద్వారా ఉద్యోగం సాధించి ఆ అప్పులు తీర్చుకోవాలని భావిస్తారు. ఇప్పుడు కొత్తగా లక్ష డాలర్ల ఫీజు కట్టాలంటే అది ఏ సామాన్య, మధ్యతరగతి విద్యార్థికీ సాధ్యమయ్యే పని కాదు. ఈ నిర్ణయం అమలైతే అమెరికా యూనివర్సిటీల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య భవిష్యత్తులో భారీగా పడిపోతుందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports