Last Updated:
ఇర్ఫాన్ మరణించినప్పటికీ, అతడి మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ కాకుండా ఉండేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రతి నెల క్రమం తప్పకుండా రీఛార్జ్ చేస్తున్నారు.
Air India Crash: గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదం వందలాది కుటుంబాలలో తీరని లోటును మిగిల్చింది. ఆ ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాలు, వ్యక్తిగత నష్టాల నుండి బాధిత కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన 22 ఏళ్ల ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్ ‘ఇర్ఫాన్ షేక్’ కుటుంబం తన కొడుకు జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడానికి ఎంచుకున్న మార్గం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇర్ఫాన్ మరణించినప్పటికీ, అతడి మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ కాకుండా ఉండేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రతి నెల క్రమం తప్పకుండా రీఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు, తాము రోజువారీ చేసే పనులు, విశేషాలను ఇప్పటికీ ఇర్ఫాన్ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్‌ల రూపంలో పంపుతున్నారు.
పూణేకు చెందిన ఇర్ఫాన్ తండ్రి సమీర్ షేక్ శుక్రవారం జరిగిన ప్రమాద మొదటి వర్ధంతి జ్ఞాపకార్థ సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు మున్నీరయ్యారు.
“ప్రమాదం జరిగి ఏడాది దాటిపోయింది. కానీ వాడు మా మధ్యే ఉన్నాడని అనుకుంటున్నాం. మా ఇంట్లో రోజు ఏం జరిగినా వాట్సాప్‌లో మెసేజ్ చేసి చెబుతాం. ఈ రోజు కూడా వాని మొబైల్‌ను రీఛార్జ్ చేశాం. మేము పంపే ప్రతి మెసేజ్ వాడికి అందుతోందని (Delivered), వాడు చూస్తున్నాడని మేము నమ్ముతున్నాం” అని సమీర్ షేక్ తన మొబైల్‌లో కొడుకుకు పంపిన మెసేజ్‌లను చూపిస్తూ బావురుమన్నారు. తీవ్రమైన దుఃఖాన్ని తట్టుకోవడానికి, కొడుకు జ్ఞాపకాలతో బతకడానికి ఈ వాట్సాప్ మెసేజ్‌లే తమకు ఒక సాధనంగా మారాయని ఆ తల్లిదండ్రులు తెలిపారు.
ఇర్ఫాన్ మృతదేహానికి సంబంధించిన కొన్ని విషయాలపై తండ్రి సమీర్ షేక్ తీవ్ర అసంతృప్తి మరియు అనుమానాలను వ్యక్తం చేశారు.
కాలిపోయిన దేహం – కాలని బట్టలు: “ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న వారందరి శరీరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని అధికారులు మాకు చెప్పారు. కానీ పోస్ట్‌మార్టం గది వద్దకు వెళ్లినప్పుడు మాకు ఒక బాక్స్ ఇచ్చారు. అందులో నా కొడుకు బట్టలు.. అంటే షర్ట్, ప్యాంట్, బెల్ట్, సాక్స్ మరియు లోదుస్తులు ఉన్నాయి. అవి ఏమాత్రం కాలలేదు. బట్టలు కాలనప్పుడు.. శరీరం మాత్రం పూర్తిగా కాలిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్టులో ఎలా రాశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలు తమను మరింత కుంగదీస్తున్నాయని వాపోయారు.
జూన్ 12, 2025 న అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 (AI-171) విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులతో పాటు 12 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది (ఇర్ఫాన్‌తో సహా) మరణించారు. అలాగే భూమిపై ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అహ్మదాబాద్, ముంబైలలో మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు క్యాండిల్ లైట్ ప్రదర్శనలతో నివాళులర్పించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













