Last Updated:
వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనాహత్ సింగ్ స్వర్ణ పతకం సాధించి అద్భుత చరిత్ర లిఖించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచి దేశం గర్వించేలా చేసింది.
భారత యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్ అరుదైన ఘనత సాధించి ప్రపంచ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. కెనడా వేదికగా జరిగిన 2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అనాహత్ అద్భుత ప్రదర్శన కనబరిచి చాంపియన్‌గా నిలిచింది. తుది పోరులో ఈజిప్ట్ క్రీడాకారిణి రుకయ్యా సలేమ్‌ను వరుస సెట్లలో ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 11-3, 11-7, 11-9 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ నెగ్గిన మొట్టమొదటి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకుంది.
కేవలం 18 ఏళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ కనబరిచిన అనాహత్ ఆటతీరుపై క్రీడా లోకం ప్రశంసలు కురిపిస్తోంది. గతంలో 2005లో జోష్న చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలవడమే ఇప్పటిదాకా భారత్ అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాస్తూ అనాహత్ నేరుగా స్వర్ణం గెలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వరుస విజయాలతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడిన అనాహత్, తన సత్తా ఏంటో చాటి చెప్పింది.
History Made! 🇮🇳
Congratulations to Anahat Singh (@Anahat_Singh13) on becoming the first Indian ever to win the World Squash Junior Championship.A phenomenal achievement and a proud moment for every Indian. pic.twitter.com/SfURD0Zg69
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 25, 2026
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ విజయంతో జూనియర్ స్క్వాష్ పోటీల్లో దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈజిప్ట్ దేశ ఆధిపత్యానికి అనాహత్ సింగ్ గట్టి బ్రేక్ వేసింది. 2010లో అమెరికాకు చెందిన అమండా సోభీ తర్వాత ఈ టైటిల్ గెలిచిన నాన్-ఈజిప్షియన్ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. టోర్నీ ఆసాంతం తన అద్భుతమైన నియంత్రణతో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు గేమ్స్ మాత్రమే కోల్పోయిందంటే ఆమె ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి మూడు రౌండ్లలో ఎలాంటి కష్టపడకుండానే సునాయాస విజయాలు నమోదు చేసింది.
టోర్నీ కీలక దశకు చేరుకున్నాక అనాహత్‌కు బలమైన ఈజిప్ట్ క్రీడాకారిణుల నుంచి సవాల్ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో హబీబా రిజ్క్‌పై 3-1 తేడాతో గెలిచిన ఆమె, సెమీస్‌లో బార్బ్ సమీహ్‌ను కూడా 3-1 తేడాతోనే మట్టికరిపించింది. ఇక ఫైనల్లో రుకయ్యా సలేమ్‌ను చిత్తు చేసి తన సుదీర్ఘ కలను నెరవేర్చుకుంది. గత ఏడాది కైరోలో జరిగిన టోర్నీలో కాంస్య పతకం గెలిచిన అనాహత్, ఇప్పుడు దాన్ని స్వర్ణంగా మార్చుకుని భారత స్క్వాష్ క్రీడలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
అనాహత్ సింగ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. దేశానికి తొలిసారి వరల్డ్ జూనియర్ స్క్వాష్ టైటిల్ అందించిన అనాహత్ గురించి గర్వపడుతున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ఈ అద్భుతమైన విజయం దేశంలోని యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, రాబోయే రోజుల్లో స్క్వాష్ క్రీడ పట్ల యువతలో మరింత ఆసక్తి పెరుగుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఆమె సాధించిన ఈ ఘనత ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం అని ప్రశంసించారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














