రాజీనామాలపై ఉత్కంఠ:
ఇటీవల వెలుగుచూసిన రామ మందిర విరాళాల దొంగతనం వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తో విచారణ జరుపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు జూన్ 26న రాజీనామాలు సమర్పించారు. “ఈ రోజు జరిగే సమావేశంలో వీరిద్దరి రాజీనామాలను ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఇండియా టుడే నివేదించింది. మరోవైపు, చంపత్ రాయ్ తాను నిర్దోషిననీ, ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకూ తన రాజీనామాను అంగీకరించకూడదని కొందరు సాధువులు డిమాండ్ చేస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
నేటి సమావేశంలో 5 ప్రధాన ఎజెండాలపై చర్చ జరగనుంది. అందులో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలతో పాటు, ఆలయ విరాళాల పెట్టెల లెక్కింపునకు సంబంధించి సిట్ (SIT) రూపొందించిన మధ్యంతర నివేదికను ట్రస్ట్ సభ్యుల ముందు ఉంచనున్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయాల అకౌంట్లను, బ్యాలెన్స్ షీట్లను ఆమోదించనున్నారు. భవిష్యత్తులో ఆలయ నిర్వహణ, నిధుల భద్రత కోసం కొత్త మార్గదర్శకాల్ని కూడా సమీక్షిస్తారు. ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి ఈ మేరకు సభ్యులందరికీ నోటీసులు జారీ చేశారు.
హాజరుకానున్న, దూరం కానున్న ప్రముఖులు:
సాధారణంగా ట్రస్ట్ సమావేశాలు మణిరామ్ దాస్ చావనీలో జరుగుతాయి. అయితే, నేటి మీటింగ్ వేదికను రామ జన్మభూమి ప్రాంగణానికి మార్చారు. కాగా, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల దాస్ తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఆయన ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నారని తెలిసింది. అలాగే.. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ప్రయాణించలేని స్థితిలో ఉన్న సీనియర్ ట్రస్టీ, ప్రముఖ న్యాయవాది కే. పరాశరన్ ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
జూన్ మొదటి వారంలో వెలుగులోకి వచ్చిన ఈ విరాళాల చోరీ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జూన్ 25న 8 మంది నిందితులపై FIR నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇండియా టుడే రిపోర్టు ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్లను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. క్యూఆర్ (QR) కోడ్ ద్వారా వచ్చే ఆన్‌లైన్ విరాళాలకే తాము పరిమితమయ్యామని, ఆలయంలోని హుండీ విరాళాల లెక్కింపుతో తమకు సంబంధం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలు, ఖర్చుల సరళిని విశ్లేషించేందుకు దర్యాప్తు అధికారులు చార్టర్డ్ అకౌంటెంట్ల సహాయం కూడా తీసుకుంటున్నారు.
ట్రస్ట్ బైలాస్, నూతన సీఈవో నియామక ఆలోచన:
ఒకవేళ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదిస్తే, ట్రస్ట్‌లో 3 కీలక స్థానాలు ఖాళీ అవుతాయి. ఇదివరకే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంతో ఒక పోస్టు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ట్రస్ట్ బైలాస్ ప్రకారం, ఒక ట్రస్టీపై చర్యలు తీసుకోవాలన్నా, వారి రాజీనామా ఆమోదించాలన్నా, ముందుగా వారి నుంచి రాతపూర్వక లేదా మౌఖిక వివరణ తీసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాతే మెజారిటీ సభ్యుల ఆమోదంతో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదా విశ్వహిందూ పరిషత్ (VHP) కూడా ట్రస్ట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను నియమించాలనే ప్రతిపాదన ఉందని, రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యోగేశ్వర్ రామ్ మిశ్రాల పేర్లు సీఈవో రేసులో వినిపిస్తున్నాయని తెలిసింది. అయితే సీఈవో నియామకం జరగాలంటే ముందుగా ట్రస్ట్ నిబంధనలు (బైలాస్) సవరించాల్సి ఉంటుంది.
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, అయోధ్యలోని సాధువులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, అయోధ్య సంత్ మండల్ నేతృత్వంలోని మరో వర్గం చంపత్ రాయ్‌కు బాసటగా నిలుస్తోంది. వశిష్ఠ మందిరానికి చెందిన మహంత్ రాఘవేష్ దాస్ మాట్లాడుతూ, “సిట్ తన తుది నివేదికను సమర్పించే వరకు చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించకూడదు. దొంగతనం జరిగిన విషయాన్ని పసిగట్టింది ఆయనే. హిడెన్ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు,” అని చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. అయినప్పటికీ, వివాదాల మచ్చతో తాను కొనసాగలేననీ, అయోధ్యలో తన సేవ పూర్తయిందని చంపత్ రాయ్ తన సన్నిహితుల దగ్గర అన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నింటి మధ్యా, నేటి అత్యవసర సమావేశం భారతీయ ఆధ్యాత్మిక, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ తర్వాత అయోధ్య రామ మందిర నిర్వహణలో సమూల మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.












