Last Updated:
పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్టు పర్వం శనివారం ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య సాగింది.
Balka Suman: సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై భారతీయ రాష్ట్ర సమితి (భారాస) కీలక నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి చందన 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్టు పర్వం శనివారం ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య సాగింది.
సింగరేణి భవనం సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అక్కడ ఉన్న భారాస శ్రేణులు, నాయకులు వారిని అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో భారాస న్యాయవాదులు, కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. అయితే, తీవ్రమైన కేసు కావడంతో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొంత సమయం తర్వాత బాల్క సుమన్ స్వయంగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారనే వార్త తెలియడంతో భారాస కార్యకర్తలు, ముగ్గురు కీలక నేతలు అక్కడకు చేరుకున్నారు. భారాస నేత శ్రావణ్ దాసోజుతో పాటు పలువురిని పోలీసులు లోపలికి అనుమతించారు. హైదరాబాద్ జోన్ డీసీపీ శరవణ్ నేతృత్వంలో సుమన్‌ను సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సింగరేణి కార్యాలయాలపై, రైలు పట్టాలపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే కోణంలో పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ అనంతరం రాత్రి వేళ ఆయనను కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షల అనంతరం బాల్క సుమన్‌ను నాంపల్లి కోర్టు జడ్జి చందన ఎదుట హాజరుపరిచారు. అయితే, రిమాండ్ డైరీని సమర్పించిన పోలీసులు, ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రతిని తీసుకురావడం మర్చిపోయారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “కనీసం ఎఫ్‌ఐఆర్ కాపీ లేకుండా రిమాండ్ ఎలా కోరుతారు?” అని పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు క్షమాపణలు చెబుతూ, సాంకేతికతను ఉపయోగించి వాట్సాప్ ద్వారా ఎఫ్‌ఐఆర్ ప్రతిని తెప్పించి ప్రింట్ తీశారు. దానికి అటెస్టెడ్ సంతకం పెట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించిన తర్వాతే రిమాండ్ ప్రక్రియ ముగిసింది.
అరెస్టుకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నన్ను ఎలాగైనా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ముందే నిర్ణయించుకున్నారు. నన్ను జైల్లో పెట్టి ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టే పోలీసులకు సహకరిస్తున్నా. నేను ఎక్కడికీ పారిపోలేదు, నా పార్టీ ఆఫీసులోనే ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.
బాల్క సుమన్ అరెస్టును భారాస తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి ‘ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేయాలి’ అని బహిరంగంగా మాట్లాడినప్పుడు దాన్ని భావప్రకటన స్వేచ్ఛగా సమర్థించుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజా సమస్యలపై సుమన్ మాట్లాడితే చట్టవ్యతిరేకం అంటున్నారని వారు ప్రశ్నించారు. ఈ అరెస్టుతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Hyderabad,Telangana













