Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన మేడ్చల్ కోర్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

బండి భగీరథ్


Last Updated:

లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్‌బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

బండి భగీరథ్
బండి భగీరథ్

Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారానికి కారణమైన మైనర్ బాలిక లైంగిక వేధింపుల (Pocso) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానం మంగళవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసుల పిటిషన్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్‌బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో బుధవారం (మే 27) నుండి మూడు రోజుల పాటు పోలీసులు భగీరథ్‌ను ప్రత్యేకంగా విచారించనున్నారు. విచారణ సమయంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల మధ్యే విచారించాలని, అనంతరం తిరిగి జైలుకు తరలించాలని నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది.

సిట్ (SIT) ముమ్మర దర్యాప్తు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిట్ అధికారులు బాధిత మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి స్టేట్‌మెంట్‌ను రెండు సార్లు రికార్డు చేశారు. అలాగే మేడ్చల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా దాదాపు 40 నిమిషాల పాటు రికార్డు చేయడం జరిగింది. భగీరథ్ స్నేహితులను కూడా సిట్ బృందం ఇప్పటికే విచారించింది.

కేసు పూర్వాపరాలు

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. 2025 జూన్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా బాలికకు భగీరథ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం అక్టోబర్ – డిసెంబర్ 2025 మధ్య కాలంలో భగీరథ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మద్యం సేవించాలని ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఏడాది జనవరిలో బ్రేకప్ అయిన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాలిక రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించినప్పటికీ కోర్టు నిరాకరించడంతో, తొమ్మిది రోజుల హైడ్రామా అనంతరం మే 16న నార్సింగి వద్ద భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు లభించిన 3 రోజుల పోలీస్ కస్టడీ ద్వారా ఈ కేసులో మరిన్ని కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports