Bandla Ganesh: బండ్ల గణేశ్‌ ఆస్తి వేలం.. ఆయన రియాక్షన్ చూశారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తాజాగా బండ్ల గణేష్ ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన ఖరీదైన ఆస్తిని బ్యాంకు వాళ్ళు వేలం వేయడానికి సిద్దమవడంతో ఈ ఇష్యూపై ఆయన స్వయంగా స్పందించారు.

News18
News18

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ఒక భారీ ఆస్తి వివాదంలో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉన్న తన కుటుంబ ఆస్తిని యూనియన్ బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేలం వేశారంటూ బండ్ల గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఈ ఆస్తి వేలం ప్రక్రియ సరైనదేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, బండ్ల గణేష్ స్పందిస్తూ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

లోపాయికారీ ఒప్పందాలతోనే వేలం..

ఈ వివాదంపై బండ్ల గణేష్ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు కుమ్మక్కై, లోపాయికారీ ఒప్పందాలతో తన ఆస్తిని అత్యంత తక్కువ ధరకు అమ్మివేశారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో స్థిరాస్తికి మార్కెట్లో కోట్లలో డిమాండ్ ఉంటుంది. అలాంటి ఆస్తిని వాస్తవ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు బినామీలకు లేదా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేలా బ్యాంక్ అధికారులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.

ట్రైబ్యునల్ నుంచి హైకోర్టు దాకా..

బండ్ల గణేష్ కుటుంబం తీసుకున్న రుణాలను వసూలు చేసే ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆస్తిని సీజ్ చేసి వేలం వేసింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బండ్ల గణేష్ 2022లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తొలుత డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT) విచారణ జరిపి, బ్యాంక్ వేలం ప్రక్రియలో లోపాలు ఉన్నాయని గుర్తించి బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ ఆస్తి వేలాన్ని రద్దు చేయడంతో పాటు, విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును కొనుగోలుదారులకు తిరిగి ఇచ్చేయాలని బ్యాంకును ఆదేశించింది.

అయితే, డీఆర్‌టీ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు.. తాజాగా డీఆర్‌టీ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. బ్యాంక్ అధికారులు చేపట్టిన ఆస్తి వేలం చట్టబద్ధమేనని, అందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టుకు గణేష్..

హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, బండ్ల గణేష్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. “నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నా ఆస్తి హక్కుల కోసం, నాకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. ఒక సామాన్యుడిలాగే తన హక్కుల కోసం చివరి వరకు పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. మరి సుప్రీంకోర్టులో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *