Last Updated:
Candle March: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి.. ఓ భారీ విజయాన్ని దక్కించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇవాళ దేశవ్యాప్త క్యాండిల్ ర్యాలీలకు పిలుపిచ్చింది. ఎందుకో తెలుసుకుందాం.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జులై 26 ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా నిశ్శబ్ద క్యాండిల్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు జులై 25న సంస్థ అధికారిక ఎక్స్ ఖాతా (@Cockroachisback) ద్వారా వచ్చింది. “ప్రతి జిల్లా. ఒకే రోజు. ఒకే డిమాండ్. దేశవ్యాప్తంగా పోలీసుల అరాచకాలకు గురైన బాధితులకు సంఘీభావం తెలపండి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని సీజేపీ ప్రకటించింది.
సీజేపీ ప్రకారం, మద్దతుదారులు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమావేశమై, విద్యార్థుల డిమాండ్లను బిగ్గరగా చదివి, ఒక్కొక్కరూ ఒక క్యాండిల్ వెలిగించి నిశ్శబ్దంగా మార్చ్ చేయాలి. “సమావేశమై సంఘటితం కండి, డిమాండ్లను చదివి వినిపించండి, మీ కొవ్వొత్తులను వెలిగించండి” అని పోస్టర్‌లో సూచించింది. విద్యార్థి సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థలూ.. అనుమతులు తీసుకొని లాజిస్టిక్స్ నిర్వహించాలని కోరారు. SOP, క్యాంపెయిన్ మెటీరియల్, మెమొరాండం టెంప్లేట్.. సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
జులై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ సమయంలో పోలీసులు విద్యార్థులపై దాడులు చెయ్యడం, లాఠీ ఛార్జ్ చెయ్యడం, టియర్ గ్యాస్ వాడటం, ఇంకా అనేక అకృత్యాలకు పాల్పడిన ఆరోపణలకు నిరసనగా ఈ క్యాండిల్ మార్చ్ జరుగుతోంది. ఢిల్లీ పోలీసు సోర్సుల ప్రకారం ఆ కార్యక్రమంలో 130 మంది పోలీసు సిబ్బంది, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. 15 FIRలు నమోదయ్యాయి. పోలీసుల దాడుల్లో కొంతమంది విద్యార్థుల తలలు కూడా పగిలాయి. సీజేపీ ఈ ఘటనలను “పోలీస్ బ్రూటాలిటీ”గా వర్ణించి, బాధితులకు సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చింది.
సీజేపీ ఉద్యమం మొదట NEET-UG, ఇతర పరీక్షల్లో లీక్‌లను వ్యతిరేకిస్తూ మొదలైంది. విద్యా వ్యవస్థ సంస్కరణల కోసం డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసింది. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరింది, శాంతియుత నిరసనకారులపై పెట్టిన FIR కేసులను రద్దు చెయ్యాలని డిమాండ్ చేసింది. ఢిల్లీతోపాటూ.. ముంబై, పుణె, పాట్నా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా అనేక ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో.. సీజేపీ డిమాండ్లకు కేంద్రం అనుకూలంగా స్పందించింది.
జులై 24న కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కొన్ని డిమాండ్లపై సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరినట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ చెప్పారు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యడం అతి పెద్ద విజయం. అందువల్ల నిర్వాహకులు శాంతియుతంగా ర్యాలీ చెయ్యాలని సీజేపీ కోరింది. “ఒక్కో వ్యక్తికి ఒక కొవ్వొత్తి. ఫెయిలైన వ్యవస్థలో బాధితులైన ప్రతి విద్యార్థి కోసం. మౌనంగా కలిసి నడవండి” అని పోస్టర్‌లో చెప్పింది.
ఈ ఉద్యమం సోషల్ మీడియా నుంచి వీధులకు వచ్చిన యువత ఉద్యమంగా మారింది. అభిజీత్ దీప్కే నాయకత్వంలో ఇది సాగుతోంది. పరీక్షా వ్యవస్థ పారదర్శకత, యువతకు ఉపాధి, ప్రజాస్వామ్య హక్కులపై ఇది ఎక్కువగా దృష్టి సారించింది. జులై 26 సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా జరిగే ఈ నిశ్శబ్ద క్యాండిల్ మార్చ్‌లు ఎలా సాగుతాయో, ఎంతమంది పాల్గొంటారు అనేది ఆసక్తికర అంశం. విద్యార్థులతోపాటూ.. పేరెంట్స్, బంధువులు, స్వచ్ఛంధ సంస్థల సభ్యులు, నిర్వాహకులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














