Last Updated:
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుక్రవారం బోణీ కొట్టింది. చిన్నతనంలో పోలియో, తీవ్ర పేదరికం, కుటుంబ పోషణ కోసం రకరకాల పనులు చేసిన కష్టాలను ఎదుర్కొన్న ఝాండు కుమార్ పారా పవర్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో దేశానికి తొలి పతకాన్ని అందించారు.
పురుషుల హెవీవెయిట్ విభాగంలో 28 ఏళ్ల ఝాండు కుమార్ 181 కేజీలు, 190 కేజీల బరువులను విజయవంతంగా ఎత్తి, మొత్తం 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత లిఫ్టర్ సుధీర్ (114.1 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక పురుషుల లైట్‌వెయిట్ విభాగంలో అశోక్ మలిక్ 143.8 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకోగా, పరమ్‌జీత్ సింగ్ 135.6 పాయింట్లతో ఏడో స్థానంలో ముగించాడు.
మహిళల హెవీవెయిట్ ఫైనల్లో కస్తూరి రాజమణి తన మూడు ప్రయత్నాల్లోనూ విఫలమవ్వగా.. లైట్‌వెయిట్ ఫైనల్లో జస్ప్రీత్ కౌర్, సుమన్ దేవి పతకాలు సాధించలేకపోయారు.
పారా స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 ఫైనల్లో కార్తీక్ బుదిగిన 57.57 సెకన్లలో రేసును పూర్తి చేసి నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. మరో భారత ఈతగాడు ఇమామ్ అలీ (1:03.73) ఏడో స్థానంతో ముగించాడు. మరోవైపు పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్లో శ్రీహరి నటరాజ్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాదుమణి సింగ్ ఆకట్టుకున్నాడు. ఆతిథ్య స్కాట్లాండ్కు చెందిన స్థానిక ఫేవరెట్ బాక్సర్ ఆరోన్ కల్లెన్‌ను 5-0తో ఓడించి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రీక్వార్టర్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన సుమామా రెహ్మాన్‌తో జాదుమణి తలపడనున్నాడు.
పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్లో తపన్ మొహంతి (71.700 పాయింట్లు) 17వ స్థానంలో, యోగేశ్వర్ సింగ్ (71.400 పాయింట్లు) 18వ స్థానంలో నిలిచి 24 మంది పోటీపడే ఆల్‌రౌండ్ ఫైనల్‌కు అర్హత సాధించారు.
ఈవెంట్ల వారీగా స్వాతిష్ కైతేరి పుతలత్ (రింగ్స్), యోగేశ్వర్ (వాల్ట్) సెకండ్ రిజర్వ్ ప్లేయర్లుగా నిలిచారు. పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 208.550 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
మహిళల పెయిర్స్: రూప రాణి తీర్కీ, పింకి సింగ్‌ల భారత జోడీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సెక్షన్-బి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన తాబెలో ముహంగో, జాక్వి జోడీపై 2-0 (6-4, 7-5) తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
పురుషుల సింగిల్స్: అస్సాం పోలీస్ అధికారి పుతుల్ సోనోవాల్ సెక్షన్-డి రెండో రౌండ్ మ్యాచ్‌లో టైబ్రేకర్ దాకా సాగిన పోరులో ఫాక్లాండ్ ఐలాండ్స్కు చెందిన సెసిల్ అలెగ్జాండర్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను 7-5తో గెలిచిన సోనోవాల్, రెండో సెట్‌ను 6-8తో కోల్పోయాడు. నిర్ణయాత్మక టైబ్రేకర్‌లో పట్టుదలతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














