Last Updated:
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ మహిళల 48 కేజీల జూడో విభాగంలో స్వర్ణ పతకం సాధించి అస్మితా డే (23) సరికొత్త చరిత్ర సృష్టించింది.
కామన్వెల్త్ క్రీడల్లో జూడో విభాగంలో భారత్ తరఫున బంగారు పతకం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా ఆమె రికార్డు పుటలకెక్కింది. అయితే, ఈ చరిత్రాత్మక విజయ వార్తను తను అందరికంటే ముందుగా పంచుకోవాలనుకున్న వ్యక్తి ఆమె తండ్రి అయితే ఇప్పుడు ఆమెతో లేరు.
త్రిపురలోని ఒక చిన్న గ్రామంలో మట్టి మిద్దె ఇంట్లో నివసిస్తూ సైకిల్ రిపేర్లు చేస్తూ నెలకు కేవలం రూ. 300 సంపాదనతో కుటుంబాన్ని పోషించిన ఆమె తండ్రి ఏడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. శుక్రవారం స్వర్ణం గెలిచిన అనంతరం ఆనంద భాష్పాలతో అస్మితా మాట్లాడారు. “నా తండ్రి చనిపోయినప్పుడు నన్ను ప్రోత్సహించే ఏకైక వ్యక్తి దూరం కావడంతో నా ప్రపంచం అంతమైపోయిందని భావించాను. ఈ పతకం నాది మాత్రమే కాదు, నా తండ్రిది కూడా” అని భావోద్వేగానికి లోనయ్యారు.
త్రిపురలోని అతి చిన్న గ్రామానికి చెందిన అస్మితా కుటుంబానికి పేదరికమే పెద్ద సవాలు. రోజుకు రూ. 300 వరకు సంపాదిస్తూ ఇల్లు గడిపే తండ్రి, కూతురు ఇష్టపడే క్రీడకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకుండా చూసుకున్నారు. అస్మిత మోకాలి గాయంతో క్రీడా జీవితం ముగిసిపోతుందేమోనన్న భయంలో ఉన్నప్పుడు, ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి వైద్యం చేయించి, మందులు కొనిచ్చి తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టేలా చేశారు.
డిసెంబరులో తండ్రి ఆకస్మిక మరణం అస్మితను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, తండ్రి అంత్యక్రియలు జరిగిన 10 రోజులకే ఆమె తల్లి ధైర్యం చెప్పి శిక్షణకు పంపించింది. “ఈరోజు నిన్ను ఆపితే, నీ తండ్రి కలను నేను చెరిపేస్తున్నానని ఆయన భావిస్తారు” అని తల్లి చెప్పిన మాటలతో అస్మితా భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కేంద్రానికి తిరిగి వెళ్లి తీవ్ర సాధన ప్రారంభించింది.
కామన్వెల్త్ పోటీలకు ముందు తీవ్ర ఆందోళనతో రాత్రుళ్లు నిద్రలేని గడిపినట్లు అస్మితా గుర్తు చేసుకున్నారు. “భారత్‌లో ఉన్నప్పుడు సరైన నిద్ర లేకపోయేది. తెల్లవారుజామున 5.30 గంటలకే లేచి శిక్షణ పొందేదాన్ని. గ్లాస్గోకు వచ్చిన తర్వాత కూడా ఆందోళన ఉండేది కానీ, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలే నన్ను నడిపించింది” అని ఆమె తెలిపారు. చివరికి ఆమె పడిన ప్రతి కష్టానికి, చేసిన ప్రతి త్యాగానికి ప్రతిఫలంగా కామన్వెల్త్ స్వర్ణ పతకం లభించింది. ఈ విజయంతో భారత జూడో చరిత్రలోనే అస్మితా డే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Aug 01, 2026 11:13 AM IST














