Last Updated:
ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది.
టార్గెట్ 265.. టోర్నీలోనే బెస్ట్ బౌలింగ్ సైడ్ అని పేరు తెచ్చుకన్న ఢిల్లీ.. ఎంత బ్యాటింగ్ లైనప్ ఉన్నా, ఇంత భారీ టార్గెట్ అంటే ప్రెజర్‌లో కష్టమే అనుకున్నారు. కానీ 265 కాదు కదా.. 300 టార్గెట్ కూడా ఈజీగా ఛేజింగ్ చేసేలా ఉన్నారు పంజాబ్ కింగ్స్. ఢిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే కొట్టి పడేశారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభుసిమ్రన్ ప్రారంభించిన మెరుపు ఆరంభాన్ని అందిస్తే.. సర్పంచ్ సాబ్ దిమ్మతిరిగే ఫినిషింగ్ ఇచ్చాడు. ప్రభుసిమ్రన్ సింగ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లో 76 (9 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు సాధించాడు. ప్రియాన్ష్ సైతం కేవలం 17 బంతుల్లో 43 (2 ఫోర్లు, 5 సిక్సులు) బాదాడు. వీరిద్దరు ఔటైన తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. 36 బంతుల్లో 71 (3 ఫోర్లు, 7 సిక్సులు) పరుగులు బాది.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. విప్రాజ్, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్, నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేఎల్ రాహుల్ కేవలం 67 బంతుల్లో 152 (16 ఫోర్లు, 9 ఫోర్లు) పరుగులు బాదగా.. నితీష్ రాణా 44 బంతుల్లో 91 (11 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు సాధించాడు. ఆరంభంలో పథుమ్ నిస్సంక (11) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఐతే, వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 220 పరుగులు జతచేశారు. 19వ ఓవర్‌లో నితీష్ ఔటయ్యాడు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, బార్ట్‌లెట్ చోరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













