Last Updated:
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను ఆర్థికంగా పూర్తిగా ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మాట వినకపోతే నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ వాతావరణం, ఉక్రెయిన్ పరిణామాల నడుమ ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. ఇరాన్ ప్రపంచానికే అతిపెద్ద ముప్పుగా మారిందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశాన్ని పూర్తిగా ఏకాకిని చేయాలని పిలుపునిచ్చారు. అణ్వాయుధాల తయారీని ఆపేసి, ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు ఇరాన్‌పై కఠిన ఆర్థిక దిగ్బంధం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇరాన్ ముందు ట్రంప్ రెండు కఠిన ఆప్షన్లు ఉంచారు. ఒప్పందానికి వచ్చి పశ్చిమాసియాలోనే గొప్ప దేశంగా ఎదుగుతారా? లేక ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా నాశనమైపోతారా? తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలను, దేశాలను నాశనం చేసే అవకాశం ఇరాన్‌కు ఇకపై ఇవ్వబోనని తేల్చిచెప్పారు. కనీసం బతికే అవకాశం కూడా లేకుండా నరకంలోకి నెట్టేయాలా అనేది తానే నిర్ణయించాల్సి ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
అయితే, అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో ఎలా రాణిస్తుందో చూసేందుకు టెహ్రాన్ ఎదురుచూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇప్పటికే గెలిచి అధికారంలో ఉన్నానని, ఇంకా రెండున్నరేళ్లు ఈ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాను పూర్తిగా సహకరిస్తానని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్-అమెరికా యుద్ధం 200 రోజులు దాటిన నేపథ్యంలో, అమెరికా దెబ్బకు ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా అడ్డుకుంటామని ఉద్ఘాటించారు. ఉగ్రవాద పాలకులు బలంగా లేరని.. వాళ్లు చాలా బలహీనంగా, దిక్కుతోచని స్థితిలో ఉండి తప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం ఏకమైతే 51 ఏళ్ల ఇరాన్ ఉగ్రవాద ముప్పు నుంచి మానవాళికి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను అధికారంలోకి రాగానే ఇరాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చానని, అణ్వాయుధ కార్యక్రమాన్ని విడిచిపెడితే పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పినా వారు ఆ అవకాశాన్ని చేజార్చుకుని తప్పు చేశారని ట్రంప్ గుర్తుచేశారు. జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం మిలిటరీ శక్తిని ఉపయోగించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. తాను పదవి చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు.














