ఇటీవల కొందరు ప్రముఖ యూట్యూబర్లు తమ వాహనాల పనితీరు E20 పెట్రోల్ కారణంగా దెబ్బతిందని ఆరోపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కేవలం మైలేజ్ తగ్గడం, ఇంజిన్ వార్నింగ్ లైట్లు వెలగడం లేదా పనితీరు తగ్గడం వంటి లక్షణాల ఆధారంగా E20 పెట్రోల్‌నే కారణంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అసలు సమస్యకు కారణం ఏమిటో అధికారికంగా నిర్ధారించుకోవడం అవసరమని చెబుతున్నారు.
వాహనంలో సమస్య కనిపిస్తే మొదట అధికారిక (ఆథరైజ్డ్) సర్వీస్ సెంటర్లో తనిఖీ చేయించాలి. అక్కడి సాంకేతిక నిపుణులు సమస్యకు కారణం ఇంధనమా, ఇంజిన్ లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా లేదా మరో సాంకేతిక కారణమా అనే విషయాన్ని నిర్ధారిస్తారు.
ఇటీవల ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీకి E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తీవ్రంగా తగ్గిందని పేర్కొన్నారు. అయితే తర్వాత కంపెనీ సర్వీస్ సెంటర్లో పరీక్షించగా సమస్య ఇంధనంలో కాకుండా ఇంజిన్‌లోనే ఉందని తేలింది. దీంతో ఆయన E20 పెట్రోల్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు కూడా చెప్పారు.
అదే విధంగా మరో యూట్యూబర్ మనీష్ కశ్యప్ తన టయోటా ఎస్యూవీ E20 పెట్రోల్ వల్ల దెబ్బతిందని ఆరోపించారు. అయితే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఆరోపణలను ఖండించారు. టయోటా నిర్వహించిన పరిశీలనలో వాహనం ఫ్యూయల్ ట్యాంక్‌లో పెట్రోల్‌తో పాటు నీరు కూడా కలిసినట్లు గుర్తించారని వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మనీష్ కశ్యప్‌పై ఇప్పటివరకు రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం.
వాహనానికి నష్టం ఎలా జరిగిందనే దానిపైనే బాధ్యత ఆధారపడి ఉంటుంది. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ తనిఖీలో తయారీ లోపం (Manufacturing Defect) కారణమని తేలితే, కంపెనీ వారంటీ నిబంధనల ప్రకారం మరమ్మతులు లేదా అవసరమైన సేవలు ఉచితంగా అందించే అవకాశం ఉంటుంది.
ఒకవేళ నాసిరకం ఇంధనం కారణమని నిర్ధారణ అయితే, సంబంధిత పెట్రోల్ బంక్ లేదా ఇంధన సరఫరాదారుపై ఆధారాలతో క్లెయిమ్ చేయాల్సి రావచ్చు. అలాగే వాహన బీమా (ఇన్సూరెన్స్) కూడా పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చాలా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. ఇంజిన్‌కు సంబంధించిన యాంత్రిక లోపాలు చాలా సందర్భాల్లో పాలసీ పరిధిలో ఉండకపోవచ్చు. అందువల్ల పాలసీ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.
అవును. కానీ తయారీ లోపం, నిర్లక్ష్యం, సేవల్లో లోపం లేదా అన్యాయ వాణిజ్య పద్ధతులు జరిగాయని ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. గ్రాండ్ విటారా ఎస్యూవీ యజమాని తన వాహనంలో పదేపదే ఇంజిన్ సమస్యలు రావడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. సుమారు 21 వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇంజిన్ ఆగిపోవడం, వార్నింగ్ లైట్లు వెలగడం వంటి సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. మొదట కంపెనీ నాసిరకం పెట్రోల్ కారణమని చెప్పి ఇంధనాన్ని మార్చినా, కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మళ్లీ అదే సమస్య ఎదురైంది.
అన్ని ఆధారాలను పరిశీలించిన రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వాహనంలో లోపం ఉందని, సేవల్లో కూడా లోపం జరిగిందని నిర్ధారించింది. అనంతరం కంపెనీ కొత్త వాహనం ఇవ్వాలని లేదా సుమారు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. తయారీ సంస్థ, డీలర్ లేదా సర్వీస్ సెంటర్ నిజమైన సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే వినియోగదారులు చట్టపరంగా న్యాయం పొందే అవకాశం ఉందని ఈ తీర్పు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమలును కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. E20 వినియోగంతో కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే డ్రైవింగ్ విధానం, టైర్లలో గాలి ఒత్తిడి, వాహన నిర్వహణ, ఎయిర్ కండిషనర్ వినియోగం వంటి అంశాలు మైలేజ్‌పై మరింత ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది.
E20 ఇంధనాన్ని ప్రవేశపెట్టే ముందు ఇంజిన్ మన్నిక, తుప్పు నిరోధకత, వాహన పనితీరు వంటి అంశాలపై విస్తృత పరీక్షలు నిర్వహించిన తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేశామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సుమారు 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ నిర్వహించింది. వీటిలో దాదాపు 1.5 కోట్ల వాహనాలు E20కు మొదట అనుమతి పొందని పాత మోడళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ E20 వల్ల వాహనాలు భారీగా దెబ్బతిన్నాయనే స్పష్టమైన ఆధారాలు బయటపడలేదని ప్రభుత్వం పేర్కొంది.
అలాగే E20 వల్ల ఇంధన పైపులు, హోసులు లేదా ఇంజిన్లకు పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉంటే తయారీ సంస్థలు, సర్వీస్ సెంటర్ల వద్ద వారంటీ క్లెయిమ్‌లు, వినియోగదారుల ఫిర్యాదులు గణనీయంగా పెరిగి ఉండేవని, అలాంటి పరిస్థితి ఇప్పటివరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.













