Essential Skills: కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు.. ఈ 10 నైపుణ్యాలను వెంటనే నేర్చుకోండి.. లేదంటే నో జాబ్స్.. | ట్రెండింగ్ | ACTPnews

News18


Last Updated:

డిగ్రీ చేతిలో ఉందంటే ఉద్యోగ జీవితానికి పూర్తిగా సిద్ధమైనట్టేనా? కాలేజీలో మంచి మార్కులు సాధించినా.. మొదటి ఉద్యోగంలో ఎదురయ్యే పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మరి మొదటి ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఆ 10 నైపుణ్యాలు ఏంటో తెలుసుకుంటే..

News18
News18

డిగ్రీ సంపాదించడం విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. కానీ కళాశాల చదువు పూర్తయిందంటే ఉద్యోగ ప్రపంచానికి పూర్తిగా సిద్ధమైనట్టే కాదు. తరగతి గదిలో పరీక్షలు, మార్కులు, పుస్తక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం నిజ జీవిత సమస్యలను పరిష్కరించడం, సహచరులతో కలిసి పనిచేయడం, సాంకేతికతను ఉపయోగించడం, సమయాన్ని నిర్వహించడం వంటి నైపుణ్యాలు అవసరమవుతాయి. అందుకే మొదటి ఉద్యోగానికి వెళ్లేలోపు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనేక రంగాల్లో పెరుగుతోంది. అందువల్ల ఏఐ సాధనాలను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవడం విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో ఒకటిగా మారింది. కోడింగ్, డేటా విశ్లేషణ, కంటెంట్ తయారీ వంటి పనుల్లో ఏఐ సాధనాలను సమర్థంగా ఉపయోగించగలిగితే పనిని వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉద్యోగ జీవితంలో కీలకం. మన ఆలోచనలను స్పష్టంగా, సూటిగా ఇతరులకు వివరించడంతో పాటు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం కూడా నేర్చుకోవాలి.

మొదటి జీతం వచ్చిన తర్వాత డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎంత ఆదా చేయాలి అనే విషయంలో అవగాహన ఉండాలి. అందుకే విద్యార్థి దశ నుంచే బడ్జెట్ నిర్వహణ అలవాటు చేసుకోవడం మంచిది. ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల మధ్య సమతుల్యత ఎలా పాటించాలో తెలుసుకోవాలి. దీనికి తోడు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవడం కూడా అవసరం. ద్రవ్యోల్బణం ప్రభావం, చక్రవడ్డీ ప్రయోజనం, మ్యూచువల్ ఫండ్స్, ఎస్‌ఐపీ, స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి మార్గాలపై ప్రాథమిక జ్ఞానం ఉపయోగపడుతుంది.

ఉద్యోగంలో ఎవరైనా పని అప్పగించే వరకు ఎదురుచూడకుండా స్వయంగా బాధ్యత తీసుకోవడం కూడా ముఖ్యమే. కొత్త సమస్యలు ఎదురైతే పరిష్కారం కోసం ప్రయత్నించడం, కొత్త ఆలోచనలు సూచించడం వంటివి వ్యక్తిగత చొరవను చూపిస్తాయి. అదే సమయంలో సమస్యలను ప్రశాంతంగా విశ్లేషించి ఆచరణాత్మక పరిష్కారం కనుగొనే సామర్థ్యం అవసరం. కోడింగ్ లోపం, క్లయింట్ సమస్య, ప్రాజెక్టు గడువు వంటి సవాళ్లు ఎదురైనప్పుడు సమస్యను చిన్న భాగాలుగా విడదీసి పరిష్కరించగలగాలి.

పని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సమయ నిర్వహణ కూడా నేర్చుకోవాలి. ఒకేసారి అనేక పనులు ఉన్నప్పుడు ఏది ముందుగా చేయాలో నిర్ణయించుకోవడం, ప్రాధాన్యతలు క్రమబద్ధీకరించడం అవసరం. అలాగే డిజిటల్ ప్రపంచంపై అవగాహన పెంచుకోవాలి. గూగుల్‌లో సమాచారం వెతకడం మాత్రమే కాకుండా నమ్మదగిన వనరులను గుర్తించడం, ఎక్సెల్, నోషన్, ట్రెల్లో వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, వ్యక్తిగత డిజిటల్ గుర్తింపును జాగ్రత్తగా నిర్వహించడం వంటి అంశాలు కూడా ముఖ్యమైనవే.

ఎంత ప్రతిభ ఉన్నా ఇతరులతో కలిసి పనిచేయడం రాకపోతే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విభిన్న అభిప్రాయాలు, స్వభావాలు, సంస్కృతులకు చెందిన సహచరులతో కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం టీమ్‌వర్క్‌లో భాగం. చివరగా, నేర్చుకోవాలనే ఆసక్తిని ఎప్పటికీ కొనసాగించాలి. డిగ్రీ పూర్తయినంత మాత్రాన విద్య ఆగిపోదు. సాంకేతికత, ఉద్యోగ రంగాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త విషయాలను నిరంతరం నేర్చుకునే అలవాటు కెరీర్‌లో ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. ఈ నైపుణ్యాలను విద్యార్థి దశలోనే అలవర్చుకుంటే మొదటి ఉద్యోగంలో ఎదురయ్యే మార్పులకు సిద్ధంగా ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports