Last Updated:
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మంగళవారం అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ‘లాస్ట్-16’ (ప్రీ-క్వార్టర్స్) మ్యాచ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం ఈ మ్యాచ్‌లో ఒకే జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 2-0తో అద్భుతమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లి, క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే చారిత్రాత్మక క్షణాలకు చేరువగా వచ్చింది. అయితే ఆఖర్లో అర్జెంటీనా నాటకీయంగా పుంజుకుని 3-2తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈజిప్ట్ ఆటగాడు ముస్తఫా జికో ఒక అద్భుతమైన గోల్ సాధించాడు. అయితే విడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) జోక్యంతో ఆ గోల్‌ను చెల్లనిదిగా ప్రకటించారు. గోల్ కొట్టడానికి కాస్త ముందు జరిగిన మూమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు లిసాండ్రో మార్టినెజ్‌పై ఫౌల్ జరిగిందనే కారణంతో ఆ గోల్‌ను రద్దు చేశారు.
అయినప్పటికీ, ఆ తర్వాత జికో మరో గోల్ కొట్టి ఈజిప్ట్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రొమెరో, లియోనల్ మెస్సి చెరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశారు.
అయితే, అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్ గెలుపు గోల్ కొట్టే తరుణంలో మరో వివాదం రాజుకుంది. అర్జెంటీనా ఆటగాడు అలెక్సిస్ మెక్ అలిస్టర్.. ఈజిప్ట్ ప్లేయర్ హమ్ది ఫాతిని వెనక నుండి లాగినందుకు గాను తమకు పెనాల్టీ ఇచ్చి ఉండాల్సిందని ఈజిప్ట్ వాదించింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ రెఫరీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లకుండా తమ జట్టును “మోసం” చేశారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ రెఫరీ ముందు తన చేతులతో “X” గుర్తును ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మైదానంలో వర్ణవివక్ష లేదా జాతి వివక్ష (Racial abuse) జరిగినప్పుడు ఫిఫా నిబంధనల ప్రకారం అధికారికంగా ఈ “X” గుర్తును ప్రదర్శిస్తారు.
“నేను ఈ ఓటమిని దురదృష్టంగా భావించి సరిపెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఈ రోజు మేము చాలా అన్యాయంగా మోసపోయాము, తీవ్రమైన వివక్షకు గురయ్యాము” అని హసన్ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 08, 2026 11:41 AM IST













