Hardik Pandya: కేకేఆర్ చేతిలో ఓటమి.. హార్దిక్ పాండ్యాకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణం ఇదే | క్రీడా వార్తలు | ACTPnews

హార్దిక్ పాండ్యా


Last Updated:

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మైదానంలో ప్రవర్తించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం రూపొందించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code of Conduct) పాండ్యా ఉల్లంఘించినట్లు మ్యాచ్ రెఫరీ నిర్ధారించారు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా

Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడటమే కాకుండా, కెప్టెన్ కూడా జరిమానా బారిన పడటంతో ముంబై జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

అసలేం జరిగిందంటే..?

బుధవారం రాత్రి కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మైదానంలో ప్రవర్తించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం రూపొందించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code of Conduct) పాండ్యా ఉల్లంఘించినట్లు మ్యాచ్ రెఫరీ నిర్ధారించారు.

వెన్నునొప్పి (Back Spasm) కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే, పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే ఆయన వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. “మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ కిట్ లేదా దుస్తులు, మైదానంలోని పరికరాలు (వికెట్లు, బెయిల్స్ మొదలైనవి) లేదా స్టేడియంకు సంబంధించిన వస్తువులను దుర్వినియోగం చేయడం లేదా వాటిపై కోపం ప్రదర్శించడం” తీవ్రమైన నేరం. హార్దిక్ పాండ్యా ఈ నిబంధననే ఉల్లంఘించినట్లు తేలింది.

తీవ్ర ఆగ్రహం.. వికెట్లపై కోపం

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో, 10వ ఓవర్ నాల్గవ బంతి వేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా, బంతి వేసి తిరిగి తన రన్-అప్ మార్క్ వైపు వెళ్తున్న క్రమంలో తీవ్ర అసహనానికి గురయ్యాడు. కోపంతో గట్టిగా వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను (Bails) చేత్తో కిందకు పడేసాడు. ఆయన ప్రదర్శించిన ఈ దూకుడు ప్రవర్తన అటు అంపైర్లతో పాటు మ్యాచ్ అధికారుల దృష్టికి వెళ్లింది.

ఆగ్రహానికి కారణం ఇదేనా?

మైదానంలో హార్దిక్ పాండ్యా అంతలా అసహనానికి లోనవడానికి ముంబై ఫీల్డర్ల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ఆ ఓవర్‌కు ముందే.. పాండ్యా వేసిన బంతికి కేకేఆర్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ముంబై ఫీల్డర్లు దీపక్ చాహర్, రాబిన్ మింజ్ వదిలేశారు. పావెల్ ఇచ్చిన టాప్-ఎడ్జ్ క్యాచ్‌ను అందుకోవడానికి వీరిద్దరిలో ఎవరూ చొరవ చూపకపోవడంతో, బంతి వారిద్దరి మధ్యలో బౌండరీ లైన్ దగ్గర పడింది. అప్పటికి పావెల్ కేవలం 14 పరుగుల (8 బంతుల్లో) వద్ద మాత్రమే ఉన్నాడు. ఈ సులువైన క్యాచ్ మిస్ అవ్వడం పాండ్యాకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఈ క్యాచ్ డ్రాప్ అయిన వెంటనే, మనీష్ పాండే వరుసగా రెండు ఫోర్లు కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. అటు క్యాచ్ మిస్ అవ్వడం, ఇటు వరుసగా ఫోర్లు పడటంతో పాండ్యా తన నిరాశను, కోపాన్ని అణచుకోలేక వికెట్లపై చూపించాడు.

పాండ్యాపై బీసీసీఐ యాక్షన్ – భారీ జరిమానా

నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఆయన క్రమశిక్షణా రికార్డులో (Disciplinary Record) ఒక డిమెరిట్ పాయింట్ (Demerit Point) కూడా చేర్చారు. ఐపీఎల్‌లో ఇటువంటి డిమెరిట్ పాయింట్లు పెరిగితే భవిష్యత్తులో మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మ్యాచ్ విషయానికొస్తే..

ముంబై నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్యాచ్ డ్రాప్ వల్ల బతికిపోయిన రోవ్‌మన్ పావెల్ 30 బంతుల్లో 40 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ముంబై విజయావకాశాలను దెబ్బతీశాడు. మరోవైపు పిచ్‌పై అద్భుతంగా రాణించిన మనీష్ పాండే 33 బంతుల్లో 45 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ పడగొట్టకుండా 13 పరుగులు ఇచ్చాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో 9వ ఓటమిని మూటగట్టుకుంది. ముంబై జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకోగా, ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *