Last Updated:
సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో, అభిమానులతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూసేందుకు రెడీ అయ్యారు హీరో నాని. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నాని అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, నాని తన అభిమానులకు ఒక మరుపురాని అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఐకానిక్ సినిమా హబ్ అయిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో చూడాలని ఆయన నిర్ణయించుకున్నారు.
అయితే, స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేలాదిగా తరలివచ్చే అభిమానులతో ఆ ప్రాంతం స్తంభించిపోతుంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు భద్రతా పరమైన సవాళ్లు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన నాని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బాధ్యతాయుతమైన పౌరుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పటిష్టమైన భద్రత మధ్య ప్రీమియర్ షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
నాని చేసిన ఈ అభ్యర్థనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సానుకూలంగా స్పందించారు. చట్టాన్ని, భద్రతా మార్గదర్శకాలను పాటించడంపై నానికి ఉన్న నిబద్ధతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
“భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు, అలాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీకాంత్ ఓదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై మీకున్న తపనకు నా అభినందనలు. మీ రాకతో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సమూహాన్ని నియంత్రించేందుకు దయచేసి సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోండి. పోలీసులు మీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పరిస్థితులకు అనుగుణంగా తగిన భద్రతా నిర్ణయం తీసుకుంటారు” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి సీఎం సూచించారు. ఒక హీరో స్వయంగా భద్రత గురించి ఆలోచించి ప్రభుత్వ అనుమతి కోరడం, దానికి సీఎం అంతే హుందాగా స్పందించడం పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.














