Last Updated:
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తిపన్ను విధింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ (Annual Rental Value) ఆధారిత పన్ను విధానానికి స్వస్తి పలికి, దాని స్థానంలో ప్రభుత్వ భూ విలువ (Land Value) ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పురపాలక శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, ఈ కొత్త విధానం వల్ల బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు, ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో పన్నుల భారం ఒకేసారి రెండు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండటంతో, భవన యజమానులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా గరిష్ఠంగా 20 శాతం మాత్రమే పన్ను పెంచేలా ఫేస్ మార్క్స్ టు బెంచ్ మార్క్స్ ప్రత్యేక ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ఈనాడు కథనం ప్రకారం.. ప్రస్తుత ఆస్తిపన్ను సవరణల కోసం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) చట్టం – 2006కు పలు కీలక సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న ఆగస్టు 17న ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ వర్షకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదంపంపేలా ముసాయిదాను రూపొందించింది. ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో సర్కారు ఈ సమతుల్య విధానాన్ని ఎంచుకుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం.. నివాస సముదాయాలకు భూవిలువలో 0.15 శాతం, అలాగే వాణిజ్య (కమర్షియల్) భవనాలకు కూడా 0.15 శాతాన్ని ప్రాథమిక రేటుగా నిర్ధారించాలని ముసాయిదాలో చేర్చారు.
ఒకేసారి 100 నుండి 200 శాతం పన్ను పెరిగితే పన్ను చెల్లింపుదారులపై పడే భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ‘క్రమబద్ధమైన పెంపు’ విధానాన్ని అమలు చేయనుంది. ఉదాహరణకు.. ఒక భవనానికి ప్రస్తుతం ఏడాదికి రూ.10,000 ఆస్తిపన్ను ఉందనుకుందాం. నూతన భూవిలువ ఆధారిత లెక్కల ప్రకారం దాని అసలు పన్ను (బెంచ్ మార్క్) రూ.20,000 కు చేరిందనుకుంటే.. మొదటి ఏడాది 20% పెంపుతో రూ.12,000 అవుతుంది. రెండో ఏడాది రూ.14,400 అవుతుంది. మూడో ఏడాది రూ.17,280కి పెరుగుతుంది. నాలుగో ఏడాది ఆ భవన పన్ను పూర్తిస్థాయి నిర్ణీత పరిమితి అయిన రూ.20,000 కు చేరుకుంటుంది. ఈ విధానం వల్ల వ్యాపారులు, భవన యజమానులకు తక్షణ ఆర్థిక భారం తప్పడమే కాకుండా, క్రమంగా కొత్త పన్ను విధానానికి అలవాటుపడే అవకాశం లభిస్తుంది.
భూ విలువ ఆధారిత విధానం రావడం వల్ల కేవలం పన్ను పెంపే కాకుండా, నగరంలోని కొన్ని సర్కిళ్లలోని నివాస భవనాలకు పన్ను తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గ్రేటర్ అధికారులు నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం ప్రకారం.. భూ విలువలపై 0.15 శాతం పన్ను విధానాన్ని వర్తింపజేస్తే:
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మూసాపేట్, కూకట్పల్లి, బేగంపేట్ వంటి ప్రధాన సర్కిళ్ల పరిధిలో నివాస గృహాలకు 5 శాతం నుంచి ఏకంగా 30 శాతం వరకు ఆస్తిపన్ను తగ్గే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వేశారు.
అయితే, బల్దియా ఆదాయం తగ్గకుండా ఉండాలంటే పన్ను రేటును 0.2 లేదా 0.3 శాతంగా విధిస్తేనే మున్సిపల్ కార్పొరేషన్‌కు లభించే ఆదాయం సమతుల్యంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అద్దె విలువ విధానం నుంచి భూ విలువ ఆధారిత విధానంలోకి మారడం సాంకేతికంగా కొంత సంక్లిష్టమైన ప్రక్రియగా మారింది. నగరంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా విధిస్తున్న లెక్కల్లో కొన్ని అసమానతలు ఉన్నాయి. ఉదాహరణకు, ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గం టీఎస్ఐఐసీ (TSIIC) ప్రాంతాలు, మాదాపూర్‌లోని పలు ప్రైవేట్ కాలనీలలో ఉన్న భూముల విలువలు పక్కనే ఉన్న మణికొండ ప్రాంతం కంటే తక్కువగా రికార్డుల్లో నమోదు కావడం వంటి వ్యత్యాసాలు వెలుగుచూశాయి.
నగర టౌన్ షిప్ హద్దులకు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సర్వే నంబర్ల భూవిలువలకు పొంతన లేకపోవడంతో సర్వే పూర్తిచేసి ఏ ప్రాంతంలో ఎంత శాతం పన్ను నిర్ధారించాలనే దానిపై పురపాలక శాఖ ఇంకా తుది స్పష్టతకు రావాల్సి ఉంది. ఈ సాంకేతిక చిక్కులను అధిగమించిన అనంతరం నూతన ఆస్తిపన్ను చట్టాన్ని నగరవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Hyderabad,Telangana














