Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్‌లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. భర్తపై భార్య, ఆమె సోదరుడు (బావమరది), మరో స్నేహితుడు కలిసి ఘాతుకానికి ఒడిగట్టారు. తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్‌లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది.

ప్రేమ వివాహం.. ఆపై మనస్పర్థలు

పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31), మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన స్వప్న గతంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2015లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో కాపురం పెట్టారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. అయితే, కొంతకాలం తర్వాత వెంకటేశ్‌కు మద్యం అలవాటు కావడంతో దంపతుల మధ్య తరచూ ఘర్షణలు, కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ గొడవలు కాస్తా ముదరడంతో మనస్పర్థలు వచ్చి దాదాపు నాలుగేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు.

భర్తకు దూరమైన స్వప్న.. తన ఇద్దరు పిల్లలను తీసుకుని వనస్థలిపురంలోని ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం (అపార్ట్‌మెంట్) లోని 7వ అంతస్తులో నివసిస్తున్న తన తల్లి, సోదరుడి వద్దకు వచ్చేసింది. అప్పటి నుంచి పిల్లలు తల్లి వద్దే పెరుగుతున్నారు.

అర్ధరాత్రి వేళ ఘోరం.. పిల్లలను చూపించమన్నందుకు దాడి

గత రెండు రోజులుగా వెంకటేశ్ తన పిల్లలను ఎలాగైనా చూడాలనే ఆరాటంతో వనస్థలిపురంలోని స్వప్న నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (రాత్రి 12 గంటల సమయంలో) వెంకటేశ్ నేరుగా ఆమె ఫ్లాట్ వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. ఆ సమయంలో ఇంట్లో స్వప్నతో పాటు ఆమె సోదరుడు దుబ్యాల పాండు, అతని స్నేహితుడు జగదీశ్ ఉన్నారు.

తలుపు తీసిన వెంటనే వెంకటేశ్ తన బిడ్డలను ఒక్కసారి చూపిండని భార్యను, బావమరదిని బ్రతిమాలాడు. అయితే, అర్ధరాత్రి వేళ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాండు, జగదీశ్ అతనితో గొడవకు దిగారు. క్షణాల వ్యవధిలోనే వివాదం ముదిరి, వారిద్దరూ వెంకటేశ్‌పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వెంకటేశ్ ముఖం, కడుపు, తల భాగాలపై చేతులతో, పిడిగుద్దులతో బలంగా కొట్టారు. తీవ్రమైన దెబ్బలకు తాళలేక వెంకటేశ్ అక్కడికక్కడే స్పృహతప్పి కుప్పకూలిపోయాడు.

మెట్లపై ఈడ్చుకెళ్తుండగా వీడియో తీసిన యువకుడు

వెంకటేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కంగారుపడిన భార్య స్వప్న, సోదరుడు పాండు, స్నేహితుడు జగదీశ్ కలిసి అతనిని అక్కడి నుంచి తరలించాలని ప్లాన్ చేశారు. 7వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో వెంకటేశ్‌ను కిందకు ఈడ్చుకుంటూ మూడో అంతస్తు వరకు తీసుకువచ్చారు. సరిగ్గా అదే సమయంలో అపార్ట్‌మెంట్‌ మెట్లపై నుంచి పైకి వస్తున్న ఒక స్థానిక యువకుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో తప్పు జరుగుతోందని అనుమానించి, వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి ఆ ముగ్గురు వెంకటేశ్‌ను కిందికి దించుతున్న దృశ్యాలను వీడియో తీశాడు.

తాము చేస్తున్న పనిని యువకుడు వీడియో తీస్తున్నాడని గమనించిన నిందితులు ముగ్గురూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, వెంకటేశ్‌ను మూడో అంతస్తు మెట్లపైనే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రాత్రంతా తీవ్ర గాయాలతో మెట్లపైనే పడి ఉన్న వెంకటేశ్, తెల్లవారేసరికి రక్తస్రావమై ప్రాణాలు విడిచాడు.

ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఒకరు పరారీ

బుధవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువకుడు తీసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితులైన భార్య స్వప్న, ఆమె సోదరుడు దుబ్యాల పాండులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా, పిల్లల విషయమై జరిగిన గొడవలోనే ఈ దాడి జరిగినట్లు వారు అంగీకరించారు. దాడిలో పాల్గొని ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు జగదీశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కన్నబిడ్డలను చూసేందుకు వచ్చిన తండ్రిని ఇలా దారుణంగా కొట్టి చంపడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports