Last Updated:
నమ్మకంగా ఇంట్లోనే ఉంటూ యజమానురాలి ప్రాణాలు తీయడానికి పథకం రచించిన నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.
Hyderabad: నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ పరిధిలో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య, భారీ దోపిడీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాలోని ఇద్దరు కీలక నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నమ్మకంగా ఇంట్లోనే ఉంటూ యజమానురాలి ప్రాణాలు తీయడానికి పథకం రచించిన నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరి ఇంట్లో నేపాల్ దేశానికి చెందిన కల్పన అనే మహిళ కొంతకాలంగా నమ్మకంగా పనిచేస్తోంది. అయితే, కల్పనకు నేపాల్‌కే చెందిన వికాస్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. వినయ్‌రంజన్ ఇంట్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించిన కల్పన, ఆ విషయాన్ని తన ప్రియుడు వికాస్‌కు చేరవేసింది. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ చేసి ఒకేసారి కోటీశ్వరులు కావాలని వీరిద్దరూ కొద్దిరోజుల క్రితమే పక్కా స్కెచ్ వేశారు.
ఈ దోపిడీని విజయవంతం చేయడం కోసం వికాస్ ఒక పెద్ద నేరపూరిత ముఠాను రంగంలోకి దించాడు. ఇందులో భాగంగా సునీల్ పెర్కార్, దిలీప్ బక్షకర్మ, సృజన్‌రాయి, నేత్రరాయి, దినేష్రాయి, శంకర్బహాదూ, గణేష్రాయి, కాలుచాకులను కలిపి ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్‌గా మార్చాడు. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ ఇంట్లో లేని సమయాన్ని కల్పన కనిపెట్టి, వెంటనే ఫోన్ ద్వారా ప్రియుడు వికాస్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ నెల 7వ తేదీన సృజన్‌రాయి, నేత్రరాయి అనే ఇద్దరు నిందితులు ఆ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ‘రెక్కీ’ నిర్వహించారు. ఇల్లు దోపిడీకి అత్యంత అనుకూలంగా ఉందని వారు గ్యాంగ్ లీడర్ వికాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పక్కా ప్రణాళిక ప్రకారం.. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (ఒంటి గంట సమయంలో) నిందితులు ప్రశాసన్‌నగర్‌లోని ఐపీఎస్ అధికారి నివాసానికి చేరుకున్నారు. ముఠాలోని నలుగురు సభ్యులు ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాయగా, ముగ్గురు నిందితులు గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వినయ్‌రంజన్ భార్య తనూజారంజన్ (మృతురాలు) ఒక్కసారిగా నిద్రలేచి కేకలు వేయడానికి ప్రయత్నించింది.
దీంతో భయాందోళనకు గురైన నిందితులు ఆమెను గట్టిగా పట్టుకుని, గొంతు నొక్కేసి, కేకలు బయటకు రాకుండా నోట్లో వస్త్రాలు (గుడ్డలు) కుక్కారు. అనంతరం ఆమె చేతులను వెనక్కి విరిచి కట్టేసి, కదలకుండా చేసి ఊపిరి ఆడకుండా దారుణంగా హతమార్చారు. తనూజారంజన్ ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక, ఆమె మెడలోని మంగళసూత్రం, చేతి వేలి ఉంగరాలను తెంచేసుకున్నారు. ఆపై బెడ్రూమ్లోని బీరువాలను పగులగొట్టి అందులో భద్రపరిచిన ఆభరణాలను మొత్తం ఊడ్చేశారు. మొత్తంగా 23 తులాల బంగారంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
హత్య మరియు దోపిడీ అనంతరం నిందితులు నేరుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామున వచ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి కాజీపేట వరకు వెళ్లారు. అక్కడ రైలు దిగి, దోచుకున్న 23 తులాల బంగారాన్ని అందరూ సమానంగా పంచుకున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మూడు వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబయి నగరానికి పారిపోయారు.
ముంబయి చేరుకున్నాక నిందితుల్లో ఒకడైన సునీల్ పెర్కార్ తనకు వచ్చిన బంగారు వాటాను ‘ఓల్డ్ నిక్సన్’ అనే బినామీ వ్యాపారికి విక్రయించాడు. అయితే, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన జూబ్లీహిల్స్ ప్రత్యేక పోలీస్ బృందం ముంబయిలో మెరుపు దాడి చేసి సునీల్ పెర్కార్, దిలీప్ బక్షకర్మలను అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రధారి వికాస్, పనిమనిషి కల్పనతో పాటు పరారీలో ఉన్న మిగిలిన నేపాలీ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Hyderabad,Telangana













