Last Updated:
ICET Coaching: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఐ-సెట్ MBA, MCA ప్రవేశాల కోసం ఉచిత ఆన్‌లైన్ డిజిటల్ కోచింగ్ మాడ్యూల్ ప్రారంభించింది, ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతూ, ఉన్నత చదువుల ద్వారా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి. ఎం.బి.ఏ (MBA), ఎం.సి.ఏ (MCA) వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐ-సెట్ (ICET) పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ మాడ్యూల్‌ను ప్రారంభించడం విశేషం. కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (CCE) ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం..
సాధారణంగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలని చాలామందికి ఉంటుంది. అయితే, ఐ-సెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. గ్రామీణ, పేద నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఇది భారంగా మారుతోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఉచిత ఐ-సెట్ కోచింగ్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రూపాయి ఖర్చు లేకుండానే నాణ్యమైన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందుతుంది.
డిజిటల్ మాడ్యూల్ ప్రత్యేకతలు: ఈ కోచింగ్ ప్రోగ్రామ్ కేవలం తరగతులకు పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి డిజిటల్ రూపంలో రూపొందించింది. ఇందులో ఉన్న సమగ్ర సిలబస్ ఐ-సెట్ పరీక్షలో కీలకమైన అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అంశాలపై నిపుణులైన అధ్యాపకులతో పాఠాలను సిద్ధం చేశారు.
విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను పరీక్షించుకోవడానికి అనేక ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. పరీక్షా సరళిని అర్థం చేసుకోవడానికి వీలుగా గత పదేళ్ల ఐ-సెట్ ప్రశ్నపత్రాలను వాటి సాధనలతో సహా మాడ్యూల్‌లో పొందుపరిచారు. అసలైన పరీక్షా వాతావరణాన్ని అనుభవించడానికి వీలుగా ఆన్‌లైన్ గ్రాండ్ టెస్టులను నిర్వహించనున్నారు.
ఈ మాడ్యూల్ పూర్తిగా ఆన్‌లైన్ డిజిటల్ పద్ధతిలో ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు తమకు వీలైన సమయంలో, కాలేజీలో లేదా ఇంట్లో ఉండి వెబ్‌సైట్ ద్వారా ఈ పాఠాలను వినవచ్చు. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే చాలు, విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఒక గొప్ప వెసులుబాటు.
ఈ పథకం ప్రయోజనం ప్రతి విద్యార్థికి చేరాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పాత్ర చాలా కీలకమని అధికారులు పేర్కొన్నారు. కాలేజీల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ మాడ్యూల్ గురించి అవగాహన కల్పించాలని, వారు లాగిన్ అయ్యేలా ప్రోత్సహించాలని కమిషనరేట్ సూచించింది. ప్రతి కాలేజీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లను ఈ కోచింగ్ కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













