Last Updated:
India vs Pakistan Final: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత మరోసారి భారత్, పాకిస్తాన్ (IND vs PAK Final) జట్లు తలపడనున్నాయి.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరు అంటే ఎప్పుడూ ఆసక్తే. క్రికెట్లో అయితే ఇది మరింత ఎక్కువ. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. గోల్డ్ మెడల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరు కోసం భారత జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు. అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. స్పిన్నర్లకు పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దాంతో భారత్ కేవలం బుమ్రాతో మాత్రమే బరిలోకి దిగనుంది. మరో పేసర్‌గా దూబే ఉండనున్నాడు. అయితే దూబే గత మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు. ఈ పిచ్‌పై రెండోసారి బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు.
ఈ మధ్య కాలంలో రికార్డులు చూస్తే భారత జట్టుదే పైచేయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు.. ఆసియా కప్.. ఆసియా గేమ్స్ లాంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత జట్టు చివరిసారిగా 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. తర్వాత మళ్లీ ఓడలేదు. ఈ మధ్య కాలంలో టి20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ఇలా ఏ టోర్నీలో తలపడ్డా భారత జట్టుదే విజయం. చివరిసారిగా ఇరు జట్ల మధ్య గతేడాది ఆసియా కప్ 2025 ఫైనల్లో పోరు జరగ్గా.. భారత జట్టు సూపర్ విక్టరీని సాధించింది.
ఇరు జట్ల బలాబలాలను చూస్తే టీమిండియాదే పైచేయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. అయితే ఆసియా గేమ్స్‌లో పరిస్థితి మరోలా ఉండే ఛాన్స్ ఉంది. వాతావరణం, పిచ్ చాలా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. పిచ్ స్లోగా ఉండే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్లో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
తుది జట్లు
టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా
పాకిస్తాన్: ఫర్హాన్ (కెప్టెన్), సదాఖ్, సైమ్ ఆయుబ్, నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్, అహ్మద్ దనియాల్, మహ్మద్ వసీమ్, మోకిమ్, అబ్రార్ అహ్మద్














