Instagram Crime: ఇన్‌స్టా‌లో ఫ్రెండ్ అయింది.. చాటుగా రమ్మంది.. ఆ తర్వాత పిల్ల చేసిన పనికి..! | | ACTPnews

News18


Last Updated:

సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో విశాఖపట్నంలో జరిగిన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.

News18
News18

సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో విశాఖపట్నంలో జరిగిన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి మాటలు నమ్మి విశాఖకు వచ్చిన ఓ యువకుడిని పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ యువతి విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన విభేదాలే ఈ దారుణ ఘటనకు కారణమయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామానికి చెందిన యోగేంద్ర బాలాజీ అనే యువకుడికి కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. అయితే అదే యువతికి అప్పటికే ప్రణీత్ అనే యువకుడితో కూడా పరిచయం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న ప్రణీత్.. బాలాజీపై ఆగ్రహం పెంచుకుని, ఆ యువతికి దూరంగా ఉండాలని, ఆమెతో సంబంధాలు కొనసాగించవద్దని హెచ్చరించినట్లు సమాచారం.

అయితే వివాదం అక్కడితో ముగియలేదు. బాలాజీపై కక్ష పెంచుకున్న ప్రణీత్.. అతడిని చిక్కుల్లో పెట్టేందుకు మరో యువతిని రంగంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలాజీతో స్నేహం పెంచుకుని, విశాఖపట్నం రావాలని ఆహ్వానించింది. ఆమె మాటలను నమ్మిన బాలాజీ మే 28న విశాఖకు చేరుకున్నాడు.

మద్దిలపాలెం ప్రాంతంలో యువతిని కలిసిన బాలాజీ.. ఆమెతో కలిసి ఆశీల్‌మెట్ట ప్రాంతానికి వెళ్లాడు. అనంతరం ఇద్దరూ సెంట్రల్ ఆటోలో ఆర్కే బీచ్ వైపు బయలుదేరారు. ఇదే సమయంలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్న ప్రణీత్ తన అనుచరులతో కలిసి బైక్‌లపై వారిని వెంబడించాడు.

ఇసుకతోట సమీపానికి చేరుకున్న తర్వాత నిందితులు ఆటోను అడ్డగించి.. యువతిని అక్కడే దింపేశారు. బాలాజీని బలవంతంగా ఆటోలోనే ఉంచి కిడ్నాప్ చేశారు. అనంతరం హనుమంతవాక, ఆరిలోవ, అడవివరం ప్రాంతాల మీదుగా భైరవకోన సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ ప్రణీత్ అలియాస్ సున్యో, పండు, టైసన్ అనే యువకులతో పాటు మరికొందరు కలిసి బాలాజీపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర గాయాలతో బయటపడిన బాలాజీ ధైర్యం చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో పాల్గొన్న వారిపై కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపులు తదితర సెక్షన్లతో పాటు ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని, ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికితీసే పనిలో ఉన్నామని తెలిపారు.

ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పరిచయం లేని వ్యక్తుల మాటలను గుడ్డిగా నమ్మడం, వ్యక్తిగతంగా కలవడం వంటి చర్యలు ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports