Last Updated:
పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ విమానంలో ప్రయాణిస్తూ ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చిత్రీకరించిన ఒక ట్రావెల్ వ్లాగ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
ఐపీఎల్ 2026 సీజన్ లో ఈ-సిగరెట్ వివాదాలు కుదిపేస్తున్నాయి. మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగి అడ్డంగా బుక్కవగా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వంతు వచ్చింది. చాహల్ ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చిత్రీకరించిన ఒక ట్రావెల్ వ్లాగ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పక్కన విండో సీట్లో కూర్చున్న చాహల్, తన చేతిలో ఏదో దాచుకుని పొగ పీల్చుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత అతడు దగ్గడం కూడా రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విమానంలో తోటి ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి చాహల్ ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀
This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026
విమానాల్లో ఈ-సిగరెట్లు తాగడం ఏవియేషన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇలాంటి చర్యలను విమానయాన సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. చాహల్ లాంటి సీనియర్ భారత క్రికెటర్ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే అతడు నిజంగానే పొగ పీల్చాడా, లేక సరదాగా అలా నటించాడా అనే చర్చ కూడా ఆన్లైన్లో నడుస్తోంది.
ఈ తాజా ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంకా అధికారికంగా స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం ముల్లాన్‌పూర్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ దొరికిపోయాడు. తన తప్పును అంగీకరించిన పరాగ్‌కు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 25 శాతం భారీ జరిమానా విధించింది.
ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి విషయంలో బీసీసీఐ ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంది. పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం లీగ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. తాజా ఉదంతంపై బోర్డు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













