Last Updated:
Iran-US War: ఇరాన్‌పై అమెరికా జరిపిన తాజా సైనిక దాడుల తర్వాత, చర్చల కోసం టెహ్రాన్ (ఇరాన్) తమను సంప్రదించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు.
ఒక ఒప్పందం కోసం ఇరాన్ “ప్రాధేయపడుతోందని” వ్యాఖ్యానించిన ట్రంప్.. అయితే భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందాన్నైనా ఆ దేశం గౌరవిస్తుందా లేదా అనే విషయమై తనకు నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేశారు. అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సు ముగించుకుని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో తిరిగి వస్తున్న సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. వాషింగ్టన్ జరిపిన తాజా సైనిక దాడుల అనంతరం ఇరాన్ తమను సంప్రదించిందని ఆయన స్పష్టం చేశారు.
“ఇంతకుముందే ఇరాన్ నుండి ఫోన్ వచ్చింది. వారెలాగైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ వారు దానికి అర్హులేనా అనేది నాకు తెలియడం లేదు. కుదిరిన ఒప్పందానికి వారు కట్టుబడి ఉంటారా అనేది ఇక్కడ అసలు సమస్య” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక చర్యను అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. టెహ్రాన్ చేసిన దాడుల కంటే వాషింగ్టన్ అత్యంత శక్తివంతంగా స్పందించిందని ఆయన అన్నారు. “మేము వారిపై చాలా తీవ్రంగా దాడి చేశాం. వారు మాపై చేసి ప్రతి దాడికి 20 రెట్లు ఎక్కువగా విరుచుకుపడతాం. వారు దాడి చేస్తే, మేము అంతకంటే బలమైన ఎదురుదాడి చేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్‌పై సైనిక చర్యకు నాటో కూటమి దేశాలు కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, అయితే ప్రస్తుతానికి అమెరికాకు వారి సహాయం అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరాన్ విషయంలో సహాయం చేయడానికి వారంతా ఎంతో ఆసక్తి చూపించారు, కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. వారంతా మాతో కలిసి రావాలని అనుకున్నారు, కానీ నిజానికి ఇప్పుడు మాకు ఎవరి సహాయం అవసరం లేదు” అని ఆయన అన్నారు.
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడిన నేపథ్యంలో.. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం “ముగిసిపోయిందని” ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వ్యూహాత్మక జలసంధి గుండా సాగే నౌకాయాన స్వేచ్ఛకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా అదనపు దాడులను ప్రారంభించింది.
భవిష్యత్తులో ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడితే అమెరికా సైనిక చర్య “ఇంతకంటే ఘోరంగా” ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఒప్పందం కోసం టెహ్రాన్ తమను సంప్రదించిందన్న ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనను తెలియజేయలేదు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














