Last Updated:
Iran-USA War: మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగిందనే కారణంతో అమెరికా తన సైనిక చర్యను ఉధృతం చేసింది.
ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలపై అమెరికా దళాలు రెండో రోజు కూడా వరుస వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులతో ఇరాన్‌లోని పలు నగరాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అత్యంత కీలకమైన ఓడరేవు నగరమైన ‘బందర్ అబ్బాస్’తో పాటు ‘సిరిక్’ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. వీటితో పాటు లావన్ ఐలాండ్, చబహార్, సిరిక్ ఐలాండ్ వంటి వ్యూహాత్మక తీరప్రాంత క్షిపణి కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
ఇరాన్‌పై తాము తాజా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు ‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకల స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించాం. అంతర్జాతీయ జలమార్గాల్లో పౌర సిబ్బంది, వాణిజ్య నౌకలపై ఇరాన్ సాగిస్తున్న అకారణ దురాక్రమణకు ఆ దేశాన్ని బాధ్యుడిని చేస్తూ ఈ చర్యలు తీసుకున్నాం” అని స్పష్టం చేసింది. అమెరికా వరుసగా రెండో రాత్రి కూడా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడం గమనార్హం.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు జరుగుతున్న తరుణంలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా సైనిక ఉద్రిక్తతలు “చాలా త్వరగా ముగుస్తాయని” ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంకారాలో జరిగిన రెండు రోజుల నాటో (NATO) సదస్సు ముగింపు సందర్భంగా విలేఖరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరుపక్షాల దాడుల అనంతరం పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశం తానేమీ చూడటం లేదని అన్నారు. “ఈ గొడవ మళ్లీ మొదటికొస్తుందని నేను అనుకోవడం లేదు. అంతా చాలా వేగంగా ముగిసిపోతుంది. వారు మన కొన్ని నౌకలపై దాడి చేశారు, అందుకే మేము అంతకంటే బలమైన దెబ్బ కొట్టాం. ఏం జరిగినా చాలా త్వరగా ముగుస్తుంది.. ఇది అంతర్జాతీయంగా చమురు రవాణాకు మరింత రక్షణను చేకూరుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













