Last Updated:
పాఠశాలల్లో బురఖా, నిఖాబ్ ధరించడాన్ని నిషేధించాలని ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై కూడా పరిమితి విధించనున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అధికారికంగా ప్రకటించారు.
ఐరోపా దేశాల్లో వలసలు, మతపరమైన ఆచారాలపై ఇటలీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పాఠశాలల్లో విద్యార్థులు బురఖా, నిఖాబ్ లాంటి ముఖాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడాన్ని పూర్తిగా నిషేధించేందుకు ఇటలీ సిద్ధమవుతోంది. దీనికి తోడు ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై చట్టబద్ధమైన పరిమితి విధించాలని నిర్ణయించింది. ఆదివారం తన పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ యువజన విభాగం వార్షిక సమావేశంలో పాల్గొన్న ప్రధాని జార్జియా మెలోని ఈ కీలక ప్రకటన చేశారు.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తమ ముఖం స్పష్టంగా కనిపించేలా మాత్రమే వెళ్లాలని ఆమె స్పష్టం చేశారు. ఏదో సంప్రదాయం పేరుతో యువతులు తమ ముఖాన్ని కప్పుకోవాలని దేశంలో ఎవరూ బలవంతం చేయకూడదని మెలోని తేల్చి చెప్పారు. ఇటాలియన్ విద్యావ్యవస్థలో కలవడానికి తీవ్ర ఇబ్బందులు పడే విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కచ్చితంగా ఇటాలియన్ భాష నేర్చుకోవాలనే నిబంధనను కూడా కొత్తగా తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలోనే ఈ కీలక చట్టాలను క్యాబినెట్ ముందుకు తీసుకురాబోతున్నట్లు మెలోని అధికారికంగా ప్రకటించారు.
తరగతి గదిలో ఇటాలియన్ భాష రాని విదేశీ విద్యార్థి ఒక్కరే ఉంటే, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సాయంతో సులభంగా భాష నేర్చుకుని మిగతా వారితో కలిసిపోతారని మెలోని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా భాష రానివారు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఇటాలియన్ విద్యార్థులతో వారు కలవడం అసాధ్యంగా మారుతుందని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఇటలీ పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల వాటా 11.6 శాతంగా ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్యను ఏ మేరకు పరిమితం చేస్తారనేది మెలోని స్పష్టంగా చెప్పలేదు. అయితే పాత చట్టాల ప్రకారం తరగతికి 30 శాతం విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతించాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. దాన్ని మరింత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కొత్త చట్టం ముఖం పూర్తిగా కనిపించకుండా ధరించే బురఖా, నిఖాబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కళ్లు సహా ముఖాన్ని స్పష్టంగా కనిపించేలా ధరించే హిజాబ్‌పై ఎటువంటి ఆంక్షలు విధించలేదని సమాచారం. ఈ చర్యల ద్వారా దేశంలో వలసదారుల ఏకీకరణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇటలీ సర్కార్ సంకేతాలు పంపుతోంది.














