Last Updated:
తెలంగాణలో అక్టోబర్ 10-22 వరకు, ఏపీలో అక్టోబర్ 12-21 వరకు దసరా సెలవులు.
దసరా పండుగ అంటేనే పిల్లలకు ముందుగా గుర్తొచ్చేది సెలవులే. స్కూల్లో పాఠాలు, పరీక్షలు, హోంవర్క్తో బిజీగా ఉండే విద్యార్థులు.. పండుగ సెలవులు ఎప్పటి నుంచి మొదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా దసరా సీజన్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి. అయితే ఏపీ, తెలంగాణలో సెలవుల తేదీలు ఒకేలా లేవు. మరి ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు? స్కూల్స్ ఎప్పుడు మళ్లీ తెరుచుకుంటాయి? ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలోని పాఠశాలలకు ఈసారి ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 9 చివరి పని దినంగా ఉండగా.. సెలవుల తర్వాత అక్టోబర్ 23న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ సెలవుల షెడ్యూల్ వర్తిస్తుంది. బతుకమ్మ, దసరా పండుగలు ఇదే సమయంలో రావడంతో విద్యార్థులకు ఈసారి కాస్త ఎక్కువ విరామం లభించనుంది.
ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ పాఠశాలలకు 10 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు సాధారణ పాఠశాలలకు సెలవులు కొనసాగుతాయి. అంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో సెలవుల వ్యవధి మూడు రోజులు తక్కువగా ఉంటుంది. అయితే క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవుల షెడ్యూల్ ఉండనుంది.
ఇక ఈసారి దసరా పండుగ అక్టోబర్ 20న వస్తోంది. తెలంగాణలో పండుగ సీజన్లో బతుకమ్మ వేడుకలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అక్టోబర్ 11 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై.. అక్టోబర్ 19న సద్దుల బతుకమ్మ జరగనుంది. అక్టోబర్ 20న విజయదశమి పండుగ ఉంటుంది. దీంతో తెలంగాణ విద్యార్థులకు బతుకమ్మ, దసరా రెండింటినీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే అవకాశం లభించనుంది.
అయితే తెలంగాణ విద్యార్థులకు సెలవులు మొదలయ్యే ముందు పరీక్షలు కూడా ఉన్నాయి. పాఠశాలల 2026-27 షెడ్యూల్ ప్రకారం సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు అక్టోబర్లోనే నిర్వహించనున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే పరీక్షలు పూర్తయిన వెంటనే దసరా సెలవులు ప్రారంభమవుతాయి.
మొత్తంగా చూస్తే.. ఈసారి ఏపీ విద్యార్థులకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు, తెలంగాణ విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. అయితే సెలవుల విషయంలో ఆయా విద్యాసంస్థలు జారీ చేసే తాజా సూచనలను కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.














