Jammu Kashmir floods: జమ్మూ కాశ్మీర్‌లో వాన బీభత్సం.. ఏడాదిలో 35 సార్లు క్లౌడ్ బరస్ట్.. 31 మంది మృతి! | | ACTPnews

News18


Last Updated:

జమ్మూ కాశ్మీర్‌ను విపరీతమైన వాతావరణ పరిస్థితులు వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 35కు పైగా మేఘవిస్ఫోటనాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమై అపార నష్టం వాటిల్లింది.

News18
News18

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 35కు పైగా మేఘవిస్ఫోటనాలు (క్లౌడ్ బరస్ట్) నమోదయ్యాయి. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, ఇతర ప్రజా మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. వాతావరణ హెచ్చరికలతో హిమాలయ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

అధికారిక డేటా, కశ్మీర్ అబ్జర్వర్ కథనం ప్రకారం.. జూన్ 1 నుంచి జూలై మధ్య కాలంలోనే కనీసం 22 మేఘవిస్ఫోటనాలు జరిగాయి. ఆ తర్వాత జూలై రెండవ భాగం నుంచి ఆగస్టు ప్రారంభం వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ వర్షాల తీవ్రతకు మరిన్ని మేఘవిస్ఫోటనాలు సంభవించి, ఆ సంఖ్య 35 దాటిపోయింది. వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్లే అత్యధిక మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.

జమ్మూ ప్రాంతంలోనే అత్యధిక నష్టం..: ప్రాణనష్టంలో ఎక్కువ భాగం జమ్మూ డివిజన్‌లోనే జరిగింది. ముఖ్యంగా పూంచ్, రాజౌరి, కథువా, దోడా, కిష్త్వార్ జిల్లాలు వాతావరణ విపత్తులకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ జిల్లాల్లో పదేపదే ఇలాంటి ఘటనలు జరగడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రాంతాల్లోని పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరోవైపు కాశ్మీర్ లోయలో కూడా వానల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా షోపియాన్, కుప్వారా జిల్లాల్లో ఇటీవల వరసగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలకు కుప్వారా, షోపియాన్, బందిపోరా, అనంత్‌నాగ్ జిల్లాల్లో పలుచోట్ల మేఘవిస్ఫోటనాలు సంభవించి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

స్తంభించిన రాకపోకలు..: భారీ వర్షాలు, వరదల వల్ల వ్యూహాత్మక జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పలుచోట్ల కొండచరియలు, బండరాళ్లు విరిగిపడటంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరఫరాకు పెద్ద ఆటంకం ఏర్పడింది. వ్యవసాయ భూములు, నీటి పారుదల కాలువలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.

పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా చినాబ్ లోయ జిల్లాల్లో విపత్తు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వరదలు వచ్చే ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. విపత్తు నిర్వహణ బృందాలు అన్ని జిల్లాల్లో రక్షణ, సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports