Last Updated:
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ హీరోగా వచ్చిన జన నాయగన్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది? కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు సునామీ సృష్టించినా, రెండో రోజు మాత్రం చతికిలబడింది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత విజయ్ నటించిన ఈ ఆఖరి సినిమాను చూసేందుకు అభిమానులు తొలిరోజు థియేటర్లకు పోటెత్తారు. కానీ, కంటెంట్ విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 42.70 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది. కానీ, రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 21.15 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అంటే ఏకంగా 50 శాతం కలెక్షన్లు డ్రాప్ అవ్వడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో రెండు రోజుల్లో దేశీయ నెట్ కలెక్షన్లు రూ. 63.85 కోట్లకు చేరుకున్నాయి.
‘జన నాయగన్’ రెండు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 112.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో భారతదేశం నుంచి వచ్చిన గ్రాస్ రూ. 75 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 37.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా రెండో రోజు ఓవర్సీస్లో రూ. 10 కోట్ల గ్రాస్ మాత్రమే నమోదైంది. ఈ సినిమాకు సొంత గడ్డ తమిళనాడులోనే అత్యధిక ఆదరణ లభిస్తోంది. రెండో రోజు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే సుమారు రూ. 15 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కూడా మోస్తరు కలెక్షన్లు వస్తున్నప్పటికీ, అంచనాలను అయితే అందుకోలేకపోయాయి.
విమర్శకుల నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడం వల్లే రెండో రోజు వసూళ్లు సగానికి పైగా పడిపోయాయని తెలుస్తోంది. అయినప్పటికీ, దళపతి విజయ్‌కు ఉన్న తిరుగులేని స్టార్డమ్ దృష్ట్యా శని, ఆదివారాల్లో (తొలి వారాంతం) మళ్లీ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉందని బయ్యర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన బిజీ అయిన నేపథ్యంలో, వెండితెరపై ఇదే ఆయన చివరి సినిమా కావడంతో అభిమానులు వారాంతంలో మళ్లీ థియేటర్ల బాట పట్టే ఛాన్స్ ఉంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














