ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,79,694 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యార్థులు ఇప్పుడు దేశంలోని ఐఐటీలు, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకునే ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా కోర్సులు, ఐఐటీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2026 కామన్ ర్యాంక్ లిస్ట్‌లో తొలి పది స్థానాలు సాధించిన విద్యార్థుల జాబితాను కూడా ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
1. శుభమ్ కుమార్ (ఐఐటీ ఢిల్లీ జోన్) – 330 మార్కులు
2. కబీర్ చిల్లర్ (ఐఐటీ ఢిల్లీ జోన్) – 329 మార్కులు
3. జతిన్ చాహర్ (ఐఐటీ ఢిల్లీ జోన్) – 319 మార్కులు
4. మోహిత్ శేఖర్ శుక్లా (ఐఐటీ మద్రాస్ జోన్) – 319 మార్కులు
5. కుచి సందీప్ (ఐఐటీ మద్రాస్ జోన్) – 318 మార్కులు
6. బి. జయకృష్ణ శ్రీనివాస్ (ఐఐటీ బాంబే జోన్) – 314 మార్కులు
7. అర్ణవ్ గౌతమ్ (ఐఐటీ ఢిల్లీ జోన్) – 314 మార్కులు
8. కనిష్క్ జైన్ (ఐఐటీ బాంబే జోన్) – 313 మార్కులు
9. మేడిసెట్టి నాగ సహర్ష (ఐఐటీ మద్రాస్ జోన్) – 312 మార్కులు
10. దర్శ్ సిక్కా (ఐఐటీ ఢిల్లీ జోన్) – 311 మార్కులు
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్(https://cdata.jeeadv.ac.in/result2026/)లో తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర లాగిన్ వివరాలను నమోదు చేసి స్కోర్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు వ్యక్తిగత ర్యాంకులు, కేటగిరీ ర్యాంకులు, అర్హత స్థితి వంటి వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులు భారతదేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందే అవకాశాన్ని దక్కించుకుంటారు. దీంతో ఫలితాల విడుదల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్సాహాన్ని నింపింది












