Kalki Bhagwan Death: కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుండి వేల కోట్ల అధిపతిగా ఎదిగిన ఆధ్యాత్మిక గురువు స్టోరీ ఇదే | ట్రెండింగ్ | ACTPnews

Kalki Bhagwan Death: కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుండి వేల కోట్ల అధిపతిగా ఎదిగిన ఆధ్యాత్మిక గురువు స్టోరీ ఇదే | ట్రెండింగ్


ఆధ్యాత్మిక గురువు ఇకలేరు..

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ మృతి చెందారు. కల్కీ భగవాన్ అసలు విజయ్ కూమార్ నాయుడు. గత కొద్దిరోజులుగా వృద్దాప్య సమస్యల కారణంగా తిరుపతిలోని తమ ఆశ్రమానికి దూరంగా ఉంటున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లుగా తెలుస్తోంది. కల్కీ భగవాన్ జీవితం మొదట్లో అందరిలాగానే సాదాసీదాగా సాగింది. ఎల్‌ఐసీ క్లర్క్ నుంచి గ్లోబల్ గురువుగా మారిపోయారు. అంతే కాదు కల్తీ భగవాన్ జీవితంలో ఆధ్యాత్మిక ప్రస్థానంతో పాటు వివాదాలు, ఐటీ దాడులు వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. సగటు మధ్య తరగతి కుటుంబ జీవనం చవి చూసిన కల్కీ భగవాన్ భగవత్ అవతారం మారిన తర్వాత ఆయనకు, ట్రస్ట్ పేరుతో భక్తులు ఇచ్చిన విరాళాల రూపంలో వచ్చిన డబ్బుతో వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు.

కల్కీ భగవాన్ అసలు పేరు..

కల్కీ భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం కేంద్రంగా దేశ, విదేశాల్లో విస్తరించిన ఆయన ప్రస్థానం ఆధ్యాత్మిక సేవలు, వినూత్న బోధనలతో ఎంతగా ప్రాచుర్యం పొందిందారు. అంతే కాదు ట్రస్ట్, ఆధ్యాత్మిక కేంద్రాలపై వచ్చిన విమర్శలతో పాటు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ఆస్తులు, ఆశ్రమాలపై ఐటీ దాడులు జరగడంతో వార్తల్లో నిలిచారు. కల్కీ భగవాన్ 1949 మార్చి 7న తమిళనాడులోని గుడియత్తంలో జన్మించారు. చెన్నై డీజీ వైష్ణవ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తొలినాళ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో క్లర్క్‌గా పనిచేశారు.

ఎల్ఐసీలో క్లర్క్ జీవితంతో మొదలు..

1980లో చేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగాన్ని వదిలి చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ‘జీవశ్రమం’ పేరుతో ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అందించే పాఠశాలను ప్రారంభించారు. 1989లో తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన ‘కల్కి’ని అంటూ తనకు తానుగా దైవస్వరూపంగా ప్రకటించుకోవడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. ఆయన భార్య పద్మావతిని ‘అమ్మ భగవాన్’గా భక్తులు ఆరాధించడం మొదలుపెట్టారు. వరదయ్యపాలెంలోని కల్కీ ఆశ్రమం మైసూర్ ప్యాలేస్‌ తరహాలో ఉంటుంది. విజయ్ కుమార్ నాయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు కృష్ణజి. గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లా వరదయ్యపాళెం వద్ద ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దుల్లో వందలాది ఎకరాల్లో భారీ ‘ఏకత్వ క్షేత్రం’ ఆన్‌నెస్ యూనివర్సిటీ -గోల్డెన్ సిటీ ఏర్పాటైంది. మార్బుల్ రాళ్లతో నిర్మించిన ఈ ఆశ్రమం అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక వేదికగా గుర్తింపు పొందింది.

వివాదాలు, విమర్శలు..

కల్కి భగవాన్ ప్రస్థానంలో వివాదాలు ఉన్నప్పటికీ, ఆయన ట్రస్ట్‌ల ద్వారా విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని సుమారు వందలాది గ్రామాల్లో తాగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధజలాన్ని అందించారు. వరదయ్యపాళెం పరిసర ప్రాంత పేద ప్రజల కోసం ఆసుపత్రులు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్ల శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాల పంపిణీ, పాఠశాల మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు చేపట్టారు.

సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

అంతే కాదు పేదలకు సేవతో పాటు ఆధ్యాత్మికత కోసం ‘దీక్ష’ & మైండ్‌ఫుల్‌నెస్ బోధనలు చేపట్టారు. ‘ఆన్‌నెస్ మెడిటేషన్’, ‘ముక్తి దీక్ష’ పేరిట ఆయన అందించిన ధ్యాన పద్ధతులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. మానసిక ప్రశాంతత, సంబంధ బాంధవ్యాల మెరుగుదలకు ఆయన ట్రస్ట్ నిర్వహించిన కోర్సులు లక్షలాది మందిలో సానుకూల మార్పు తెచ్చాయని భక్తులు విశ్వసిస్తారు. కీర్తి పెరిగిన కొద్దీ కల్కి ఆశ్రమం చుట్టూ వివాదాలూ ముసురుకున్నాయి. వరదయ్యపాళెం పరిసరాల్లో స్థానిక రైతుల నుంచి అటవీ భూముల నుంచి వేలాది ఎకరాలను బలవంతంగా, తక్కువ ధరకు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలుమార్లు ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఇక దర్శనాలు, ధ్యాన తరగతులు, ప్రత్యేక దీక్షలకు వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దేశీయ భక్తుల కంటే విదేశీ సంపన్నులకే ప్రాధాన్యం ఇస్తూ ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చారనే విమర్శలు బలంగా వినిపించాయి.

తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి..

2008లో ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీవ్ర దుమారం రేపింది. అక్కడి నుంచి మరింత అపకీర్తి మూటగట్టుకోవాల్సి వచ్చింది. కల్కి ఆశ్రమం ఎదుర్కొన్న అతిపెద్ద దెబ్బ 2019 అక్టోబర్‌లో జరిగిన ఆదాయపు పన్ను దాడులు. కల్కి భగవాన్, ఆయన కుమారుడు ఎన్‌కేవీ కృష్ణకు చెందిన దాదాపు 40 ప్రాంతాల్లో (చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాళెం) ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో సుమారు రూ. 44 కోట్ల భారత కరెన్సీ, రూ. 20 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం, దాదాపు 90 కిలోల బంగారం బయటపడ్డాయి.

ఐటీ దాడులతో ఆధ్యాత్మిక ఆశ్రమం కనుమరుగు..

ఆశ్రమం, దానికి అనుబంధంగా ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థల ద్వారా రూ. 500 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయం, విదేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ దాడుల తర్వాత తాను దేశం విడిచి పారిపోలేదని, అనారోగ్యం కారణంగా ఆశ్రమానికి దూరంగా ఉన్నానని కల్కి భగవాన్ వీడియో సందేశం విడుదల చేయాల్సి వచ్చింది. సామాన్య ఉద్యోగి స్థాయి నుంచి ప్రారంభించి అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక వ్యవస్థను నిర్మించిన కల్కి భగవాన్ జీవితం చివరకు ఈవిధంగా ముగిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports