ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చెయ్యగా.. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్ గా హెచ్‌కే పాటిల్ ఉండబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్లో చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం ఉండేలా డీకే ప్లాన్ చేసుకున్నారు.
శివకుమార్‌కి యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ పార్టీ ‘ట్రబుల్ షూటర్’, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ (దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్) కర్ణాటక నూతన (34వ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.
జననం: మే 15, 1962న రామనగర జిల్లా కనకపురలో వొక్కలిగ సామాజిక వర్గంలో జన్మించారు. విద్యార్థి దశలోనే యూత్ కాంగ్రెస్ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
రాజకీయ ప్రస్థానం: కనకపుర తదితర నియోజకవర్గాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తన సత్తా చాటారు. 2020 నుంచి కేపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయానికి కీలక పాత్ర పోషించారు.
అధికార బాధ్యతలు: గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, భారీ నీటిపారుదల, బెంగళూరు అభివృద్ధి శాఖల మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. అధికార బదిలీ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు.
కీలక వ్యూహకర్త: కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అనేక సంక్షోభాల్లో ఆయన ముందుండి నడిపించారు. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ దాడులు, జైలు జీవితం వంటి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని పార్టీకి విధేయుడిగా నిలబడిన నాయకుడు డీకే శివకుమార్.












