Last Updated:
ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నట్లు సమాచారం.
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠభరిత పరిణామాలు అందరి దృష్టిని అటెన్షన్ చేసింది. ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహిస్తున్న సమావేశంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అధికార సమీకరణాల చర్చలకు ఈ భేటీతో ముగింపు దొరకవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
న్యూస్ 18 కన్నడ కథనం రాసిన వివరాలు ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకత్వ మార్పు, లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కర్ణాటకలో “పవర్ షేరింగ్” అంశంపై తరచూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కొంతకాలం తర్వాత డీకే శివకుమార్‌కు అప్పగిస్తారనే ప్రచారం అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే అధికారికంగా పార్టీ ఎప్పుడూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సమావేశం ఆ చర్చలకు మరింత ఊతమిచ్చింది.
డీకే శివకుమార్ అనుచర వర్గం ఆయనకు సీఎం పదవి ఇవ్వాలని బలంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిద్ధరామయ్య వర్గం మాత్రం ప్రస్తుత నాయకత్వంలో మార్పులు అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కాయి.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకోవడం రాజకీయ ప్రాధాన్యతను పెంచింది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఏ దిశగా ఉంటుందన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని కాపాడుతూ, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సీఎం మార్పుపై ఒత్తిడి పెరిగితే మరో సీనియర్ నేత జి.పరమేశ్వర్ పేరు కూడా తెరపైకి రావచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
రాజకీయంగా కీలకమైన రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ అంతర్గత విభేదాలకు ముగింపు పలికి ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్ రాజకీయ సమావేశంపైనే నిలిచింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 26, 2026 10:33 AM IST













