హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెడుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి శనివారమే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, తన తండ్రి స్థాపించిన పార్టీ కూడా సజావుగా సాగుతున్న టైమ్‌లో సొంతంగా ఆమె పార్టీ ఎందుకు పెడుతున్నారని అటు రాజకీయ నాయకులతో పాటు ప్రజలను తొలస్తున్న ప్రశ్న. తండ్రి చాటు కుమార్తెగా అంతా సజావుగానే సాగుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి కవిత ఏం చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత అడుగుల వెనుక ఆంతర్యం ఏమిటి… కారణాలు ఏంటో విశ్లేషిద్దాం…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగానే కాదు కేసీఆర్ బిడ్డగా యావత్ తెలంగాణ ప్రజానికానికి సుపరిచితురాలైన కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13 న జన్మించారు. కవిత చిన్న నాటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగారు. అప్పటికే ఆమె తండ్రి కేసీఆర్ విద్యార్థి, యువజన రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వారు. ఆమెకు ఏడేళ్ల వయస్సు వచ్చే నాటికే కేసీఆర్ 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కీసీఆర్ ఓటమి ఎరుగని నాయకునిగా ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయాల పరంపర కొనసాగింది. తెలుగుదేశం హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. 1995 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాడిన రాజకీయ సంక్షోభం, చంద్రబాబు సీఎం కావడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావం, తెలంగాణ ఏర్పాటు ఇలా ప్రతీ కీలక మలుపులో మజిలీలో కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. నడుస్తున్న రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తూ పెరిగారు. దీంతో ఆమెకు రాజకీయాల్లో తనదైన ముద్ర ఉండాలనే ఆంకాంక్ష బలపడిందని ఆమె సన్నిహితులు చెబుతారు. కాని ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం “మన పని మనం చేసుకుంటూ పోవడమే. ప్రత్యేకంగా కోరికలంటూ ఏం లేవు.” అనేవారు కవిత. కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రం “నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎందుకు కాకూడదు?” అని ఇటీవల పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు కవిత.
2003 వరకు అమెరికాలో ఉన్నత విద్యభ్యాసం, పెళ్లి, అమెరికాలోనే ఉద్యోగం చేసేవారు. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం కేసీఆర్ కేంద్రమంత్రి కావడం, హరీష్ రావుతో సహా పలువురు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంత్రివర్గంలో మంత్రులు కావడం చకచకా జరిగిపోయాయి. ఇదే తరుణంలో కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చి సొంతంగా తెలంగాణ జాగృతి పేరుతో సంస్థ ఏర్పాటు చేసి తెలగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారనే చెప్పాలి.
అయితే తండ్రి పార్టీలో తనకు హై పొజిషన్ ఉన్నప్పటికి “ఎమ్మెల్యే కాక ముందే హరీష్ రావు మంత్రి అయ్యారనే అసూయ కవితకు మొదటి నుంచి ఉంది. తాను మంత్రి కావాలనే అమెరికా నుంచి తిరిగి వచ్చారు కవిత. ఆ లోపే తన ఫ్యామిలీలోని వారంతా వైఎస్ మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. వ్యక్తిగత గుర్తింపు కోసం తెలంగాణ జాగృతి పేరుతో ఓ దుకాణం పెట్టారు. ఎప్పుడూ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే కవిత బీఆర్ఎస్ని వీడిన తర్వాత నుండి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.” అని ఓ బీఆర్ఎస్ నాయకుడు న్యూస్18 తో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే రాజకీయాల్లో తమ మార్కు ఉండాలని మొదటి నుంచి కవిత తాపత్రయ పడుతున్నారన్నది సుస్పష్టం. దానికి అనుగుణంగానే మొదటి నుంచి అగుడులు వేస్తూ వస్తున్నారు కవిత. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కోసం తనదైన కృషి చేశారు. దీంట్లో భాగంగా తెలంగాణ బతుకమ్మ పండగకు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో గుర్తింపు కోసం కృషి చేశారు కవిత. ప్రతీ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడంతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఉత్సవాలు నిర్వహించారు. సింగపూర్, అమెరికా, బ్రిటన్, దుబాయ్ తదితర దేశాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఆ విధంగా కవిత వ్యక్తిగంతంగా గుర్తింపు సంపాధించడంతో పాటు తమ సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతి కూడా గుర్తింపు తెచ్చిపెట్టారు.
2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ వేడుకల్లో కవితను భాగస్వామిగా చేయడంతో పాటు ఆమెను “తెలంగాణ బతుకమ్మ” గా కీర్తించారు ఆమె తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.
2014లో కవిత నిజామాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చక్కని పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం ఆమెకు పార్టీలోనే కాదు ఢిల్లీ రాజకీయాల్లో కూడా ప్లస్ పాయింట్‌గా మారాయి. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపై కవిత లోక్ సభలో కూడా లేవనెత్తి తన ప్రతిభను చాటారు. అంశాలపై అవగాహన ఏర్పరచుకొని చక్కని వాక్చాతుర్యంలో సభలో తమ వాదన వినిపించే వారు కవిత. అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుడా కవితను పలు సందర్భాల్లో అభినందించే వారు. లోక్ సభ కు సంబంధించిన వివిధ కమిటీల్లో కవితకు ప్రతినిథ్యం కల్పించి ప్రోత్సహించే వారు. దీంతో పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నాయకులతో, ఎంపీలతో, కేంద్ర మంత్రులతో, ముఖ్యమంత్రులతో పరిచయం సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె కూడా స్వయంగా జాతీయ నాయకురాలిగా ఎదిగారు. తరచూ నేషనల్ మీడియా చర్చల్లో కనిపిస్తూ నేషనల్ లీడర్ అయ్యారు కల్వకుంట్ల కవిత.
“ఒక రకంగా చెప్పాలంటే అన్న కేటీఆర్ కంటే కవితనే ఇంటలీజెంట్ అని చెప్పాలి. కేటీఆర్ తండ్రి చాటు తనయునిగా రాష్ట్రంలోనే రాజకీయాలు నడిపారు. కానీ కవిత రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చురుకుగా పని చేశారు. కేసీఆర్ సపోర్ట్ తో ఎన్నికల్లో గెలిచినా… సొంతంగా గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చాకున్నారు. సొంత తెలివి తేటలు, ముఖ్యమంత్రి కుమార్తె అని ఉండే ప్రత్యేక గుర్తింపు ఎలాగూ ఉంటుంది.” అని సీనియర్ జర్నలిస్టు మార్తా సుబ్రహ్మణ్యం న్యూస్18 తో అన్నారు. “ఒక దశలో అవే పరిచయాలు ఆమె కొంప ముంచాయి. దిల్లీ మద్యం కేసులో జైలుకు వెళ్లేలా చేశాయి. కోర్టు కేసు కొట్టేసినా దాదాపుగా ఆరు నెలలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.” అని ఆయన అన్నారు. ఇదంతా కవిత సక్సెస్ఫుల్ పొలిటికల్ జర్నీలో షడన్ బ్రేక్‌లా కాదు కాదు స్పీడ్ బ్రేకర్లా మారిందంటున్నారు.
2018 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమి పాలయ్యాక కవిత ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ కుమార్తెను కూడా గెలిపించుకోలేక పోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2020లో స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకు మంత్రి పదవి ఇస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని… కేటీఆర్ ను సీఎంగా చేసి, కవితకు మంత్రి పదవి ఇస్తారని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చి గుణాత్మక మార్పు… స్థానిక పార్టీల ఏకీకరణ పేరుతో కేసీఆర్ దేశ వ్యాప్తంగా పర్యటించి వివిధ ప్రాతీయ పార్టీల నాయకులను కలిసిన సమయంలోనూ కవిత కీలకంగా వ్యవహరించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఎన్నికల సమయంలో కవిత మద్యం కేసులో జైలులో ఉన్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాకపోవడం కవితలో అసంతృప్తి మరింత పెరిగింది. పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ, బీజేపీ అమకూలంగా వ్యవహరిస్తాన్నరని… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్ సమర్థవంతంగా పని చేయడం లేదని… పార్టీ నాయకులు హరీష్ రావు, సంతోష్ రావుల కారణంగా పార్టీ నష్ట పోతోందని ఇలా సొంత నేతలు కాదు కాదు సొంత మనుషులపైనే అనేక అంశాలతో కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం… బహిరంగ వేదకలపై విమర్శలు చేయడంతో పార్టీకి కవితకు దూరం పెరిగింది. పార్టీ కవితను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అవకాశం కోసం ఎదురు చూసిన కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె పార్టీలో ఉన్నంత కాలం, పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఓ పవర్ సెంటర్ గా ఉన్నారు. ఆమె కావాల్సిన పనులు చక్కబెట్టుకున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో సమానంగా ఆమెకు ప్రాధాన్యత లభించింది, అధికారులు కూడా ఆమె మాటను జవదాటేవారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలిన శివగామిలా వ్యవహరించారని రాజకీయ మేధావులే చెబుతుంటారు. మరీ ఏదైనా అత్యవసరమైతే కేసీఆర్ కు చెప్పి పనులు చేయించుకునే వారు. ఆమె వర్గానికి చెందిన, జాగృతికి చెందిన నాయకులకు పదవులు, పార్టీ టికెట్లు కూడా ఇప్పించుకున్నారు ఇదంతా ఓపెన్ సీక్రెట్.
“కవిత చిన్నతనం నుంచి రాజకీయ వాతావరణంలోనే పెరిగారు. తనకు సమర్థత ఉన్నా పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదనే భావన ఆమెలో ఉండటం తప్పే కాదు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయనే నెంబర్ 2. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారు. ఆమె మిగతా స్థానాలతో సరిపెట్టుకోల్సిందే తప్పితే కేసీఆర్ తర్వాతి స్థానాన్ని సంపాదించాలేరు. ఇక ఆ తర్వాత హరీష్ రావు. పైకి చూడ్డానికి కలిసి ఉన్నట్టే ఉన్నా అంతర్గత విభేదాలు కచ్చితంగా ఉంటాయి. దేశంలో ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల్లో ఉన్న పరిస్థితే ఇది.” అని సీనియర్ జర్నలిస్టు వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి న్యూస్18 తో అన్నారు.
కవిత జైలుకు వెళ్లి వచ్చాక పరిస్థితులు మరింత వ్యతిరేకంగా మారాయని మరి కొంత మంది విశ్లేషకుల అభిప్రాయం. “కవిత జైలుకు వెళ్లాక ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. పార్టీ కూడా ఆమెకు అంగడా నిలవలేదు. దీంతో ఆమె అహం దెబ్బతింది. కేసీఆర్ వారసత్వం ఎలాగూ దక్కదన్న స్పష్టత ఉంది. దీంతో ఆమె వేరు కుంపటి(కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.” అని సీనియర్ జర్నలిస్టు మార్తీ సుబ్రహ్మణ్యం న్యూస్18తో చెప్పారు.
వీటన్నింటికి తోడు ఆర్థికంగా కూడా కవిత పరిపుష్టంగానే ఉన్నారనే వాదనలు బలంగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు, నిర్వహణ వ్యయం, పార్టీ నిర్మాణం, ఎన్నికలు తదితర అవసరాలకు సరిపడా ఆర్థిక స్తోమత కవిత దగ్గర ఉందనేది రాజకీయ వర్గాల భావన.
ఏదైమైన కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. పార్టీ భవితవ్యం ఏమిటి….. ఎన్ని సీట్లు వస్తాయి…. రాజీకీయంగా ఎలాంటి పాత్ర పోషిస్తారు…తదితర అంశాలు పార్టీ విధానాలు… ఆ విధానాలపై ప్రజలిచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత బీఆర్ఎస్లో ఉంటే వచ్చే గుర్తింపు, ఫాలోయింగ్ కంటే వేరే పార్టీ పెట్టి తానేంటో నిరూపించుకుంటేనే కరెక్ట్ అని భావించే ఈ పొలిటికల్ స్టెప్ వేస్తున్నారని కూడా రాజకీయ వర్గాలు, సీనియర్ పాత్రికేయలు చెప్పుకుంటున్నారు.












