Last Updated:
భారీగా కురిసిన వర్షాలకు కాలువలు, వాగుల నుంచి గ్యాస్ సిలిండర్లు కొట్టుకోస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో సిలిండర్లను చూసిన జనాలు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం….
భారీ వర్షాల మధ్య ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చావణే ప్రాంతంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్లాంట్ ఆవరణలోకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,200 ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
మహారాష్ట్రలో వర్షాలు, వరదలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో చూపించే ఈ ఘటన రాయగడ్ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలో HPCLకు చెందిన గ్యాస్ సిలిండర్లు బొమ్మల్లా నీటిలో కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సిలిండర్లు అన్నీ ఖాళీగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎరుపు రంగు గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో తేలుతూ కనిపిస్తున్నాయి.
ఈ ఘటన రాయగడ్ జిల్లా ఖలాపూర్ తాలూకాలోని చావణే ప్రాంతంలో జరిగింది. అక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ ప్రాంతాల నుంచి వచ్చే వాగులు, కాలువల నీటి మట్టం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరద ప్రవాహం నేరుగా చావణేలోని HPCL గ్యాస్ రీఫిల్లింగ్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది.
रायगड जिल्ह्यात मुसळधार पावसामुळे पाताळगंगा नदीला आलेल्या प्रचंड पुरात शेकडो एलपीजी गॅस सिलिंडर गेले वाहून ! pic.twitter.com/U90lHp1HP8
— निसर्गराजा (@shetakriraja288) July 8, 2026
ప్లాంట్‌లో గ్యాస్ నింపేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1,200 ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. వరద నీరు అత్యంత వేగంగా లోపలికి రావడంతో ఉద్యోగులకు వాటిని రక్షించే అవకాశం కూడా దక్కలేదు. క్షణాల్లోనే భారీ సిలిండర్లు కాగితపు పడవల్లా నీటిలో కొట్టుకుపోయాయి. ఉద్యోగులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రకృతి ఉద్ధృతిని ఎదుర్కోలేకపోయారు.
ఈ ఘటనలో అత్యంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, వరదలో కొట్టుకుపోయిన 1,200 సిలిండర్లు అన్నీ పూర్తిగా ఖాళీగా ఉండటం. వాటిని గ్యాస్ నింపేందుకు మాత్రమే ప్లాంట్‌కు తీసుకొచ్చారు. ఒకవేళ వాటిలో గ్యాస్ నిండి ఉంటే, వరదలో ఒకదానికొకటి ఢీకొనడంతో గ్యాస్ లీకేజీ, అగ్నిప్రమాదం లేదా భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఖాళీగా ఉండటంతో పెద్ద విపత్తు తప్పింది.
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సిలిండర్లు చివరకు పాతాళగంగా నదిలో చేరాయి. నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఉద్యోగులు లేదా స్థానికులను వాటిని తీసుకురావడానికి అనుమతించలేదు. ప్రాణ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తూ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రస్తుతం HPCL సంస్థతో పాటు స్థానిక అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. కొట్టుకుపోయిన సిలిండర్ల కోసం గాలింపు కొనసాగుతోంది. అలాగే ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆకస్మిక వరదల నుంచి ప్లాంట్‌ను ఎలా రక్షించాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలు నదులు, వాగుల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













