Last Updated:
‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత రూత్ ప్రభుకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నయనతార ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపగా, సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ‘మా ఇంటి బంగారం’ విజయంపై స్పందిస్తూ సమంతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘మా ఇంటి బంగారం’ పోస్టర్‌ను షేర్ చేసిన నయనతార.. “సామ్.. నీకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ ప్రేమ, విజయానికి పూర్తిగా అర్హురాలివి. ‘మా ఇంటి బంగారం’ మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు” అంటూ ప్రేమతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో నయనతార చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య ఉన్న అనుబంధంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక బాక్సాఫీస్ పరంగా ‘మా ఇంటి బంగారం’ మంచి వసూళ్లు సాధిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొలి రోజు రూ.5.35 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.6.57 కోట్లను రాబట్టింది. దీంతో రెండు రోజులకే దేశవ్యాప్తంగా రూ.11.92 కోట్ల నెట్, రూ.13.95 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరగడం సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా సమంత గత చిత్రాలైన ‘యశోద’, ‘ఘాటి’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మొదటి రోజు వసూళ్లను కూడా ఈ సినిమా అధిగమించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత సమంత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా విజయపథంలో దూసుకుపోతోంది.
మరోవైపు సమంత వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తోంది. పింక్విల్లా కథనం ప్రకారం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె గర్భధారణ తొలి దశలో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబర్లో బిడ్డ జన్మించే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. అయితే ఈ వార్తలపై సమంత లేదా రాజ్ నిడిమోరు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, సినీ అభిమానుల్లో ఈ వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













