Last Updated:
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు మెప్పించాయా? అనేది చూద్దామా..
సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రం నేడు అనగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చాలా గ్యాప్ తర్వాత సమంత కమ్ బ్యాక్ సినిమా కావడంతో ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్స్ చేసి సినిమాపై హైప్ తీసుకొచ్చారు. మరి ఈ రోజు విడుదలైన మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉందొ చూద్దామా..
స్వర్ణ (సమంత), అనిరుధ్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. అయితే వీరి పెళ్లి అనిరుధ్ సాంప్రదాయ కుటుంబానికి నచ్చకపోవడంతో కొంతకాలం పాటు ఆ కుటుంబానికి దూరంగా ఉంటారు. అనిరుధ్ చెల్లెలి పెళ్లి కుదరడంతో, వీరు తిరిగి సొంత ఇంటికి వస్తారు. ఆ సాంప్రదాయ కుటుంబ సభ్యుల మనసులు గెలుచుకోవడానికి స్వర్ణ శతవిధాలా ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో, జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) అనే ప్రమాదకరమైన వ్యక్తి స్వర్ణ గురించి ఆరా తీస్తూ, ఆమె కోసమే జైలు నుండి తప్పించుకుంటాడు. అసలు స్వర్ణకు, కరుణకు ఉన్న పాత పగ ఏంటి? స్వర్ణ గతం ఏంటి? ఆమె అసలు పేరు ఝాన్సీనా? కరుణ నుండి తన అత్తగారి కుటుంబానికి ముప్పు పొంచి ఉందని తెలిసిన తర్వాత స్వర్ణ వారిని ఎలా కాపాడుకుంది? అనేదే చిత్ర ముఖ్య కథాంశం.
కథ పరంగా చూస్తే ఇది ఒక పాత పగలు, ప్రతీకారాల చుట్టూ తిరిగే రొటీన్ ఫ్యామిలీ డ్రామా. ఒక ఇల్లు, ఆ ఇంట్లోని సెంటిమెంట్ ఎమోషన్స్, వాటి మధ్య వచ్చే నలుగురు డమ్మీ విలన్లు, కాస్త చప్పగా సాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన బలహీనత. కథలో పెద్దగా దమ్ము లేకపోయినప్పటికీ, సమంత తన అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో ముందుకు నడిపించారు. కొత్త కోడలిగా ఎమోషనల్ సీన్లలోనూ, అలాగే ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ సమంత వన్ ఉమెన్ షో చూపించారు. కథనం సాగదీస్తున్నట్లు అనిపించే తరుణంలో, అక్కడక్కడా వచ్చే కామెడీ పంచ్‌లు, చిన్న చిన్న నవ్వులు ప్రేక్షకుడికి ఊరటనిస్తాయి. ‘ఓ బేబీ’ రేంజ్ మ్యాజిక్ కాకపోయినా, కుటుంబంతో కలిసి చూసేలా నందిని రెడ్డి దీన్ని తీర్చిదిద్దారు.
సమంత తర్వాత ఈ చిత్రంలో విలన్‌గా నటించిన గుల్షన్ దేవయ్య మరోసారి తన నటనతో భయపెట్టారు. శ్రీముఖి తన పరిధి మేరకు చక్కగా నటించగా, మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక పరంగా ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది, విజువల్స్ అద్భుతంగా కుదిరాయి. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అయితే సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా.. కథలో క్రిస్పీ లేకపోయినా, సమంత నెట్టుకొచ్చిన ‘మా ఇంటి బంగారం’ ఇది.
రేటింగ్: 2.25
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













