Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు


11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్‌జీఓ కాలనీలోని వంశీమోహన్ నివాసం, మేడ్చల్‌లోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లపై మెరుపు దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న ఆయన మామ విజయభాస్కర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం (రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా) కేవలం రూ. 6.22 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే పత్రాల్లో కనిపించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి అసలు విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో రూ. 5.68 కోట్ల విలువైనవి కేవలం స్థిరాస్తులే కావడం గమనార్హం.

సీజ్ చేసిన ఆస్తుల వివరాలు ఇవే.

సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు గుర్తించి, సీజ్ చేసిన ఆస్తుల జాబితా చాంతాడంత ఉంది.

భూములు, ప్లాట్లు: వివిధ ప్రాంతాల్లో రూ. 4.46 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 19 ఓపెన్ ప్లాట్లు.

భవనాలు: వనస్థలిపురం ఎన్‌జీఓ కాలనీలో ఒక స్వతంత్ర ఇల్లు (ఇండిపెండెంట్ హౌస్). మణికొండలో 1,000 చదరపు గజాల ప్లాట్, హైటెక్ సిటీ సమీపంలోని మసీద్‌బండలో 2,000 చదరపు అడుగుల విలాసవంతమైన ఫ్లాట్.

ఫామ్‌హౌస్: ఇబ్రహీంపట్నం మండలం నైన్‌వాల్ (నర్రెపల్లి) పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ ఫామ్‌హౌస్.

నగదు, బ్యాంకులు: రూ. 2.16 లక్షల నగదుతో పాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 20 లక్షల బ్యాలెన్స్.

వాహనాలు, బంగారం: రూ. 32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, కియా కార్లు మరియు 122 గ్రాముల బంగారు ఆభరణాలు.

శేరిలింగంపల్లి భూములపై బేరాలు!

వంశీమోహన్ గతంలో (2019-21 మధ్య) శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలోనే ఈ అవినీతి సామ్రాజ్యానికి పునాదులు పడినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, చందానగర్, కొండాపూర్, హఫీజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఇనాం భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఈయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రముఖ కాంట్రాక్టర్‌తో జతకట్టి, ప్రభుత్వ ప్రయోజనాలకు గండి కొడుతూ కోట్లాది రూపాయల అయాచిత లబ్ధిని ఆర్జించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.

పింగళీపూర్ భూవివాదం.. మామ పేరిట రిజిస్ట్రేషన్

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పింగళీపూర్ గ్రామం సర్వే నంబర్ 17 లోని 8 ఎకరాల వివాదాస్పద వ్యవసాయ భూమిని వంశీమోహన్ తన అధికార బలంతో హస్తగతం చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. దీనిపై అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రాత్రి వరకు సోదాలు చేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ భూమిని మొదట తన మామ విజయభాస్కర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఒక రియల్టర్‌కు ధారాదత్తం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా సదరు రియల్టర్ అభివృద్ధి చేసిన వెంచర్ల నుండి 10 ఓపెన్ ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో వంశీమోహన్ లంచంగా పొందినట్లు అధికారులు గుర్తించారు.

రెండేళ్లుగా పక్కా ప్లాన్.. లాకర్లు ఖాళీ!

ఏసీబీ అధికారులు వంశీమోహన్ చాణక్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎప్పటికైనా తనపై ఏసీబీ నిఘా పడుతుందని ముందే ఊహించిన వంశీమోహన్, గత రెండేళ్లుగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాడు. ప్రస్తుత నివాసంలో ఎలాంటి విలువైన ఆస్తుల పత్రాలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. అధికారులు ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్లను తెరిచి చూడగా, అందులో కనీస స్థాయిలో కూడా బంగారం లభించలేదు. తన తండ్రి ఒక రిటైర్డ్ ఉద్యోగి అయినప్పటికీ, ప్రస్తుతం తాను డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నప్పటికీ లాకర్లలో బంగారం లేకపోవడాన్ని బట్టి.. దాడులు జరుగుతాయనే అనుమానంతోనే పక్కా వ్యూహంతో ఆస్తులను, బంగారాన్ని ముందే బినామీల స్థావరాలకు మార్చినట్లు ఏసీబీ గట్టిగా అనుమానిస్తోంది. ఈ నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *