Manmohan Singh: కోల్ స్కాంలో మాజీ ప్రధానికి క్లీన్ చిట్.. మరణించిన రెండేళ్లకు కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు! | | ACTPnews

News18


Last Updated:

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ, ఈ వివాదాస్పద కేసును కోర్టు శాశ్వతంగా మూసివేసింది.

News18
News18

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం (కోల్‌గేట్) కేసులో ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015లో మన్మోహన్ సింగ్‌తో పాటు మరో ఐదుగురిని విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను అత్యున్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవంటూ గతంలో సీబీఐ రెండు సార్లు సమర్పించిన క్లోజర్ రిపోర్టులను తాము అంగీకరిస్తున్నామని, కింది కోర్టు ఆ రిపోర్టులను తిరస్కరించడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో మన్మోహన్ సింగ్ మరణించిన రెండేళ్ల తర్వాత ఈ కేసుకు తెరపడింది.

అసలేంటీ బొగ్గు స్కామ్ కేసు..

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2005లో ఒడిశాలోని తలబిరా-2 బొగ్గు బ్లాక్‌ను హిందాల్కో సంస్థకు కేటాయించారు. అప్పట్లో బొగ్గు శాఖ కూడా ఆయన వద్దే ఉండటంతో విపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ, మన్మోహన్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది. కానీ 2015లో కింది కోర్టు ఆ రిపోర్టును కాదని, కుట్ర, నమ్మక ద్రోహం కింద ఆయనకు సమన్లు జారీ చేసింది. వెంటనే స్పందించిన మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ సమన్లపై స్టే విధించింది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై తాజాగా తీర్పు వెలువరించింది.

మరణించిన రెండేళ్ల తర్వాత..

వాస్తవానికి మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్‌లో కన్నుమూశారు. అయితే, ఆయన మరణించినప్పటికీ ఈ కేసు చట్టబద్ధతను తేల్చాలని భావించిన సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా మన్మోహన్ సింగ్ వ్యక్తిగత నిజాయితీ మరోసారి రుజువైందని కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కింది కోర్టులు దర్యాప్తు సంస్థల నిర్ణయాలతో విభేదించవచ్చని, కానీ దానికి సరైన న్యాయపరమైన కారణాలు ఉండాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో యూపీఏ హయాంలో దేశ రాజకీయాలను కుదిపేసిన బొగ్గు కుంభకోణం వివాదంలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *