Last Updated:
వీకెండ్‌లో ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదా? హైదరాబాద్‌లో సరికొత్త మాయాలోకం.. లోపలికి వెళితే మీ కళ్లను మీరే నమ్మలేరు. గచ్చిబౌలిలో ఈ అద్భుతం చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భాగ్యనగర వాసులకు వినోదాన్ని పంచేందుకు ఒక సరికొత్త ప్రపంచం అందుబాటులోకి రాబోతోంది. కళ, ఆధునిక సాంకేతికత కలబోతగా ఒక అద్భుతమైన మాయాలోకం సందర్శకులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిజమ్ మాల్ వేదికగా జూన్ 6వ తేదీన ‘మాయా వరల్డ్’ పేరుతో ఈ సరికొత్త ఇమ్మర్సివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతిరోజూ చూసే సాధారణ అమ్యూజ్‌మెంట్ పార్కులకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అద్భుతమైన విజువల్ వండర్స్‌తో ప్రతి ఒక్కరినీ వేరొక ఊహా లోకంలోకి తీసుకెళ్లేలా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీకెండ్స్ ఆనందంగా గడపడానికి ఇది సరైన వేదికగా నిలవనుంది.
ఇందులో మీరు గడిపే ప్రతి నిమిషం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఒక గంట పాటు సాగే ఈ వినోద యాత్రలో రకరకాల థీమ్స్ ఆధారంగా డిజైన్ చేసిన గదులు సందర్శకులను ఎంతగానో కట్టిపడేస్తాయి. ఇక్కడ బ్లింకింగ్ స్టార్ రూమ్, గ్లోయింగ్ ప్లానెట్ రూమ్, ఎల్లో ప్లానెట్స్ రూమ్, పెర్ల్ కర్టెన్ రూమ్ లాంటి ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో కొలువుదీరాయి. ఇవి కాకుండా ఎల్ఈడీ టైమ్ టన్నెల్, బ్రీతింగ్ ఫారెస్ట్, కాలిడోస్కోప్ రూమ్, ఓషన్ బాల్ పిట్, అవతార్ ట్రీ రూమ్ లాంటివి అందరికీ సరికొత్త అనుభూతిని పంచుతాయి. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడి అద్భుతాలను చూసి ప్రతి ఒక్కరూ కచ్చితంగా మురిసిపోతారు.
ఇక ఇందులో ఏర్పాటు చేసిన ‘మిర్రర్ మేజ్’ సందర్శకులకు ఒక సరదా సవాల్ విసురుతుంది. ఎటు చూసినా అద్దాలే కనిపించే ఈ పద్మవ్యూహం నుంచి బయటకు రావడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డిజ్జీ టన్నెల్, డిజ్జీ బ్రిడ్జిలు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో మన బ్యాలెన్స్ ను పరీక్షించేలా వీటిని అత్యంత నైపుణ్యంతో రూపొందించారు. రంగులు, కాంతి, ఆప్టికల్ ఇల్యూషన్స్ కలయికతో ప్రతి గదిలోనూ ఒక విభిన్నమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ప్రతి అడుగులోనూ ఎదో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తూ సందర్శకులను ఈ మాయా వరల్డ్ తనలో పూర్తిగా మైమరపిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియులకు, సోషల్ మీడియా క్రియేటర్లకు ఈ మాయా వరల్డ్ ఒక అందమైన స్వర్గధామం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన లైటింగ్, రంగురంగుల డిస్ప్లేలు, ఇన్ఫినిటీ స్టైల్ రిఫ్లెక్షన్స్ కెమెరా కన్నుకు అద్భుతమైన బ్యాక్ డ్రాప్ గా నిలుస్తాయి. గ్లోయింగ్ టన్నెల్స్ నుంచి ఇమ్మర్సివ్ థీమ్ గదుల వరకు ప్రతి మూల ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు అందమైన రీల్స్, ఫోటోలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పదిలపరుచుకోవచ్చు. కొత్తదనం కోరుకునే కంటెంట్ క్రియేటర్లకు ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గచ్చిబౌలి ప్రిజమ్ మాల్ లో కొలువుదీరిన ఈ వినోద కేంద్రం టికెట్ల ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఒక గంట మాయాలోక విహారం కోసం పెద్దలకు రూ.499 ప్లస్ టాక్స్, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.299 ప్లస్ టాక్స్ గా నిర్ణయించారు. నాలుగేళ్లలోపు పసిపిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఇందులో ఫ్లాషింగ్ లైట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మూర్ఛ వ్యాధి లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. సృజనాత్మకత, టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ మాయాలోకం హైదరాబాద్ నగరంలో సరికొత్త ల్యాండ్ మార్క్ గా నిలవనుంది.
Hyderabad,Telangana













