Last Updated:
పరాయి పురుషుడి వ్యామోహంలో పడి, తన ముక్కుపచ్చలారని ఐదేళ్ల కన్నకూతురిని ఓ తల్లి దారుణంగా గొంతునులిమి హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయిందంటూ నమ్మించి అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది.
Murder: మాతృత్వానికే మచ్చతెచ్చేలా, నైతిక విలువలను పూర్తిగా దిగజార్చేలా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. పరాయి పురుషుడి వ్యామోహంలో పడి, తన ముక్కుపచ్చలారని ఐదేళ్ల కన్నకూతురిని ఓ తల్లి దారుణంగా గొంతునులిమి హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయిందంటూ నమ్మించి అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది. అయితే, ఆమె పంపిన పోస్ట్‌మార్టం రిపోర్టులోని లోపాలను విదేశాల్లో ఉన్న ఒక డాక్టర్ గుర్తించడంతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నిందితురాలైన తల్లి వృత్తిరీత్యా న్యాయవాది (లాయర్) కావడం గమనార్హం. కాడుగోడి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రవీణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి కాగా, ప్రియాంక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. వీరికి 11 ఏళ్ల కుమారుడు, వెన్నెల (5) అనే కుమార్తె ఉన్నారు. బెంగళూరులోని కాడుగోడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో ప్రియాంకకు.. చిన్నప్పుడు పాఠశాలలో తనతో పాటు చదువుకున్న మోహన్ అనే వ్యక్తి మళ్లీ పరిచయమయ్యాడు. తాను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారినని, కోటీశ్వరుడినని మోహన్ ఆమెను నమ్మించాడు.
అతని మాయమాటలు నమ్మిన ప్రియాంక, క్రమంగా భర్తను కాదని మోహన్‌కు బాగా దగ్గరైంది. వీరి వివాహేతర సంబంధాన్ని భర్త ప్రవీణ్ గమనించి, ఇద్దరినీ తీవ్రంగా హెచ్చరించాడు. అయినప్పటికీ ప్రియాంక ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భర్తకు విడాకుల నోటీసులు పంపి, కూతురు వెన్నెలను తీసుకుని మోహన్‌తో సహజీవనం (Live-in relationship) చేయడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
మోహన్‌తో కలిసి ఉంటున్న సమయంలో, వారి సాన్నిహిత్యానికి ఐదేళ్ల చిన్నారి వెన్నెల అడ్డుగా అనిపించింది. దీంతో ప్రియుడితో మరింత స్వేచ్ఛగా ఉండేందుకు ఆ కన్నబిడ్డను వదిలించుకోవాలని ప్రియాంక నిర్ణయించుకుంది. ఒకరోజు క్రూరంగా ఆ పాప గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం, ఏమీ తెలియనట్టుగా పాప తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించిందని భర్త ప్రవీణ్‌కు, తన పుట్టింటి వారికి సమాచారం అందించింది. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది.
తను లాయర్ కావడంతో చట్టం నుండి ఎలా తప్పించుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్న ప్రియాంక, స్థానికంగా మేనేజ్ చేసి ఒక పోస్ట్‌మార్టం రిపోర్టును సంపాదించి, దానిని భర్తకు పంపింది. అయితే, ఇక్కడే కథ అడ్డం తిరిగింది.
భర్త ప్రవీణ్‌కు కూతురి మరణంపై మొదటి నుండి అనుమానం ఉంది. దాంతో ప్రియాంక పంపిన పోస్ట్‌మార్టం (మరణోత్తర పరీక్ష) నివేదికను.. విదేశాల్లో వైద్యుడిగా పనిచేస్తున్న తన ఒక స్నేహితుడికి వాట్సాప్‌లో పంపి పరిశీలించాల్సిందిగా కోరాడు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన సదరు విదేశీ డాక్టర్.. ఈ రిపోర్టు అసంపూర్తిగా, అనుమానాస్పదంగా ఉందని, పాపది సహజ మరణం కాదని ప్రవీణ్‌కు స్పష్టం చేశాడు.
స్నేహితుడి ఇచ్చిన సమాచారంతో ప్రవీణ్ వెంటనే కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. పాపను తల్లి ప్రియాంకనే గొంతునులిమి చంపినట్లు ఆధారాలతో సహా తేలింది. దీంతో పోలీసులు మొదట ప్రియుడు మోహన్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పరారైన ప్రియాంక.. హాసన్ జిల్లాలో తలదాచుకున్నట్లు గుర్తించి, గురువారం పోలీసులు ఆమెను కూడా బేడీలు వేసి బెంగళూరుకు తరలించారు.
పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం తెలిసింది. ప్రియాంక నమ్మిన ప్రియుడు మోహన్ కోటీశ్వరుడు కాదు సదా, కేవలం అద్దె ఇళ్లకు బ్రోకరేజ్ చేసుకునే సాధారణ వ్యక్తి అని తేలింది. బాగా దగ్గరయ్యాక అతని ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా, ప్రియాంక భారంగానే అతనికి సహకరిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే కన్నబిడ్డను సైతం కోల్పోయింది. అటు నమ్మిన ప్రియుడు మోహన్ మోసగాడని తేలడం, ఇటు కన్నకూతురిని చంపిన కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ప్రియాంక జీవితం ఇప్పుడు జైలు పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘోర కలికాలం ఉదంతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం మరియు విచారం వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













